మన్యంలో మాతృ ఘోష..పెరుగుతున్న మాతాశిశు మరణాలు

  • గిరిపల్లెలకు అందని పోషకాహారం వేధిస్తోన్న ఎనీమియా
  • వైద్య సౌలత్​లు కూడా అంతంతే
  • బాల్య వివాహాలు, మూఢనమ్మకాలూ కారణమే

భద్రాచలం, వెలుగు:  మన్యం ప్రాంతంలో మాతాశిశుమరణాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సర్కారు ఎన్ని స్కీంలు తెచ్చినా వాటికి పుల్ స్టాఫ్​పడడం లేదు. ఇటీవలే మన్యంలోని ములకలపల్లి మండలం ఒడ్డురామారం గ్రామానికి చెందిన జాటోత్ హరిత(20) అనే 8 నెలల గర్భిణికి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఆమెను వెంటనే108‌‌‌‌‌‌‌‌లో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే ఫిట్స్ వచ్చాయి. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఇలాంటి సంఘటనలు నిత్యం మన్యంలో జరుగుతూనే ఉంటాయి. గిరి పల్లెల్లో పోషకాహార లోపం శాపంగా పరిణమించింది. ఎనీమియా వేధిస్తోంది. ఫలితంగా గర్భిణులు తీవ్ర అనారోగ్యంతో ప్రసవ సమయంలోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఇదే పరిస్థితిలో ఈ ఏడాది ఇప్పటికే 12 మంది తల్లులు చనిపోయారు. శిశువు 2.50 కిలోల బరువుతో పుడితే ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క అని డాక్టర్లు చెబుతున్నారు. కానీ చాలా వరకు శిశువులు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఇదే కారణంతో పుట్టిన వెంటనే చనిపోతున్నారు. 2023లో ఇప్పటి వరకు 285 మంది శిశువులు ప్రాణాలు వదిలారు. తక్షణం మెరుగైన వైద్యం అందే పరిస్థితులు లేకపోవడం కూడా వారి మరణాలకు కారణమవుతోంది.

అందని పోషకాహారం...

మన్యంలోని గిరిజన గూడేలను పేదరికం ఇంకా వెంటాడుతోంది. రెక్కాడితే కానీ డొక్కాడని ధీన పరిస్థితుల్లో బుక్కెడు బువ్వ దొరకడం కూడా కష్టమే. అంగన్​వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం కూడా వారికి చేరడం లేదు. రోజూ పెట్టాల్సిన ఆహారం పది రోజులకు ఒకసారి అందిస్తుండడం, మారుమూల పల్లెల్లోనైతే అది కూడా చేరకపోవడం గర్భిణులకు శాపంగా తయారైంది. నీరసించి అనారోగ్యానికి గురైతే గూడేల్లోని వెజ్జోళ్ల(మంత్రగాళ్ల)ను ఆశ్రయిస్తున్నారు. అడవుల్లో ఉండే గ్రామాలకు రహదారి లేక వైద్య సిబ్బంది కూడా వెళ్లలేని దుస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో తమకు అందుబాటులో ఉండే వెజ్జోళ్లే వారికి దిక్కవుతున్నారు. ఆదివాసీల్లో నేటికీ బాల్యవివాహ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. నిరక్షరాస్యత కారణంగా అనాగరికపు పనులు ఇంకా సాగుతున్నాయి. ఇలా పేదరికం, మూఢనమ్మకాలతో గర్భిణులు ప్రసవ సమయంలో ఇక్కట్లు పడుతున్నారు. వారికి పుట్టే బిడ్డలు కూడా అనారోగ్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే మాతాశిశువులు చనిపోతున్నారు. 

అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

గర్భిణుల విషయంలో వైద్యాఆరోగ్యశాఖ తరపున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. వారికి అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయికి వెళ్లి మందులు అందిస్తున్నాం. డెలివరీ సమయంలోనే వారు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. 
- డాక్టర్​చైతన్య, మాతా సంరక్షణాధికారి

అవే సమస్యలు..అదే తీరు...

మన్యంలో మాతాశిశు మరణాలు పెరగడానికి మొదటి నుంచి చెప్పుకుంటున్న సమస్యలే. వైద్యంతోపాటు పోషకాహారం కూడా ఆదివాసీలకు అందట్లే. ఐసీడీఎస్​నుంచి చేరాల్సిన బియ్యం, పప్పు, గుడ్లు, నూనె ఎప్పుడూ సక్రమంగా వచ్చింది లేదు. బాల్యవివాహాలు కూడా ప్రధాన కారణం. ఈ సమస్యలు ఉన్నంత కాలం మాతా,శిశుమరణాలకు చెక్​పెట్టలేరు.

  గాంధీబాబు, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యుడు