
- 203 ఎకరాల్లో రూ.109.44 కోట్లతో నిర్మాణం
- ఇప్పటివరకు వచ్చింది ఒక్కటే కంపెనీ
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందుబాటులో పలు తోటలు
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలోనే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద ఫుడ్‌పార్క్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో ఉన్న బుగ్గపాడు(203 ఎకరాలు)లో గతేడాది డిసెంబర్లో ప్రారంభమైంది. 5 నెలలవుతున్నా అక్కడ కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. మూడేళ్ల క్రితం తమకు ఫుడ్‌పార్క్ లో స్థలం కేటాయించాలంటూ 70 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. అప్లికేషన్లను పరిశీలించిన తర్వాత 5 కంపెనీలకు అనుమతినిచ్చారు. కానీ, ఇప్పటివరకు మామిడి గుజ్జు ప్రాసెస్‌చేసే ఒక్కటే కంపెనీ ఏర్పాటైంది.
అది కూడా గతేడాది 2, 3 నెలలపాటు కార్యకలాపాలు నిర్వహించి, మామిడి సీజన్ముగియగానే క్లోజ్‌చేసింది. ఈ ఏడాది మామిడి సీజన్ప్రారంభమైనా ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. జీడిమామిడికి సంబంధించిన మరో పరిశ్రమ గ్రౌండింగ్కాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా రకాల పండ్ల తోటలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ముడిసరుకు సమీపంలోనే ఉన్నా పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 35 ఏళ్ల లీజు కోసం ఎకరానికి రూ.45 లక్షల చొప్పున రేటు నిర్ణయించారు. ఇది ఎక్కువని పారిశ్రామికవేత్తలు భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
2008లో భూమిపూజ..
ఫుడ్ పార్క్ కు 2008లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆ తర్వాత పనులు ముందుకు సాగలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా రూ.109.44 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 60 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజీలు, వేర్‌హౌస్ లు, ప్యాకింగ్ గోడౌన్లు, సబ్‌స్టేషన్, ప్రహరీ, సెంట్రల్ లైటింగ్, రీపెనింగ్ చాంబర్లు, గ్రేడింగ్ చాంబర్, డివైడర్లు, డ్రైనేజీలు నిర్మించారు.
మరో 26 ఎకరాల్లో పరిశ్రమలకు స్థలం కేటాయించాలని నిర్ణయించారు. గతేడాది డిసెంబర్ 6న మంత్రులు నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు ఈ పార్క్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
మెగా ఫుడ్‌పార్క్ లో కంపెనీలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఫుడ్‌ప్రాసెసింగ్ రంగంలో ఉన్న అవకాశాలను వివరిస్తూ, పార్క్ ను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. తాజాగా ఉన్నతాధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమీక్షించారు. ఆఫీసర్లపై సీరియస్ అయ్యారు. వెంటనే నిర్లక్ష్యం వీడి, పారిశ్రామికవేత్తలు, ఈ రంగంలో ఉన్న కంపెనీలతో మాట్లాడాలని ఆదేశించారు. లీజు రేట్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెప్పగా, సమీక్షించి పెట్టుబడిదారులను ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పంటలు.. రవాణా సదుపాయాలు
ఉమ్మడి జిల్లాలో ఆయిల్ పామ్లక్ష, తేజా రకం మిర్చి లక్ష, మామిడి 43 వేలు, బత్తాయి 2 వేలు, జీడి మామిడి 1,200, అరటి 1,000, జామ 1,000, బొప్పాయి 1,000, కొబ్బరి 850, కోకో 1,200 ఎకరాల్లో, కూరగాయలు దాదాపు 16 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఫుడ్‌పార్క్‌కు రవాణా సదుపాయం ఉంది. ఖమ్మం, రాజమండ్రి గ్రీన్‌ఫీల్డ్ హైవే, నాగపూర్, విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే, 180 కిలోమీటర్ల దూరంలో కాకినాడ పోర్టు, 170 కిలోమీటర్ల దూరంలో మచిలీపట్నం పోర్టు, 110 కిలోమీటర్ల దూరంలో విజయవాడ ఎయిర్‌పోర్టు, 50 కిలోమీటర్ల దూరంలో కొత్తగూడెం రైల్వే స్టేషన్ఉన్నాయి.