ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి

ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : రఘురాంరెడ్డి
  • మౌలిక వసతుల కల్పనకు కేంద్రం నిధులు వినియోగించాలి
  • ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
  • దిశ సమావేశంలో కేంద్ర పథకాలపై సమీక్ష

ఖమ్మం, వెలుగు : జిల్లాలో నూతన రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగించుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సమావేశానికి హాజరయ్యారు. మొదట పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.

 తర్వాత ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై జిల్లా సంక్షేమ అధికారి, పరిశ్రమల శాఖ జనరల్​మేనేజర్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జాతీయ రహదారుల శాఖ పీడీ తదితరులు నివేదికలు చదివారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై సమగ్రంగా సమాచారం అందిస్తే ఫాలో అప్ చేస్తామని తెలిపారు. 

జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులతో సమావేశం నిర్వహించి వాటి మురుగు నీటి నిర్వహణపై రివ్యూ నిర్వహించాలని చెప్పారు. ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవసరమైతే ప్రతిపాదనలు అందించాలన్నారు. కేంద్ర పథకాల నుంచి వచ్చే నిధులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన రిపోర్టులను అందించాలని అధికారులను ఆదేశించారు.

ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు సన్మానం.. 

ఆడపిల్లలు పుడితే పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించి జిల్లా యంత్రాంగం తరఫున స్వీట్ బాక్స్ తో వెళ్లి సదరు కుటుంబ సభ్యులను అభినందిస్తున్నామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం, షాపింగ్ మాల్స్ లలో దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా ర్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ఇతర పథకాలపై విస్తృతంగా యువతకు, మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల కోసం ఇందిర మహిళా శక్తి, ప్రత్యేక పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సమర్థంగా వినియోగించుకుంటూ వ్యాపార యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు. ఆయా పథకాలలో వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించి అర్హులకు యూనిట్లు మంజూరు చేయాలని, బ్యాంకుల దగ్గర పెండింగ్ ఉండకుండా చూడాలని అన్నారు. దరఖాస్తులను తిరస్కరిస్తే లబ్ధిదారులకు తగిన కారణాలు తెలియజేయాలని ఆదేశించారు. 

జిల్లాలో అంధులకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. జిల్లాలో ఉన్న 20 భవిత సెంటర్లకు దివ్యాంగులను రవాణా చేసేందుకు కూడా ఏదైనా సహకారం అందించాలన్నారు. మహిళా సంఘాల ద్వారా కలెక్టరేట్, బస్టాండ్  లాంటి రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో స్త్రీ టీ స్టాల్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయాల వద్ద మహిళా సంఘాలతో జిరాక్స్ షాపుల ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేసే పదార్థాలకు బ్రాండింగ్, మార్కెటింగ్ కల్పించేందుకు మహిళా మార్ట్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ పూర్తి చేశామన్నారు.

సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి 

తనికెళ్ల నుంచి కొణిజర్ల, పల్లిపాడు, వైరా మీదుగా రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కోరారు. ప్రభుత్వం సన్న బియ్యం  పంపిణీ చేస్తున్నందున అవసరమైన చోట అదనపు రేషన్ షాపులను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరు చేసిన పనులను పాఠశాలలు ప్రారంభ సమయం కంటే ముందు పూర్తి చేయాలన్నారు. కారేపల్లి మండలంలో గాంధీపురం కేంద్రంగా అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని కోరారు. వైరా ఆస్పత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఆర్డీవో సన్యాసయ్య, జడ్పీ సీఈఓ దీక్షా రైనా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.