రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రితో చర్చిస్తా : రాఘురాంరెడ్డి

రైళ్ల పునరుద్ధరణకు కేంద్ర మంత్రితో చర్చిస్తా :  రాఘురాంరెడ్డి


భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కోవిడ్​ తర్వాత కొత్తగూడెంలోని రైల్వేస్టేషన్​ (భద్రాచలం రోడ్) నుంచి రద్దైన రైళ్లను పునరుద్ధరించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడతానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. కొత్తగూడెంలోని రైల్వే స్టేషన్​ను ఆయన ఆదివారం సందర్శించారు. రైల్వే స్టేషన్​లో రూ. 25కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. 

రైళ్ల రాకపోకల వివరాలను రైల్వే ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చుంచుపల్లి మండలం విద్యానగర్​ కాలనీలోని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి క్యాంప్​ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతేడాది కేవలం 55 రోజులు మాత్రమే పార్లమెంట్​నడిపిందన్నారు. దాదాపు మూడున్నర నెలల పాటు పార్లమెంట్​ను నడపాల్సి ఉన్నా పార్లమెంట్​ సమావేశాలను కుదిస్తూ ప్రజా సమస్యలను పక్కన పెడుతోందని ఆరోపించారు. 

రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా పార్లమెంట్​ సమావేశాలను జరిపేలా బీజేపీ ప్రభుత్వం చూడాలన్నారు. జిల్లాలో ఎయిర్​ పోర్ట్​ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కొత్తగూడెం పట్టణంలోని రైల్వే స్టేషన్​ పక్క నుంచి త్రీ టౌన్​ పోలీస్​ స్టేషన్​ మీద నిర్మించే రోడ్డు కోసం అవసరమైన రైల్వే స్థలం కోసం సీఎం రేవంత్​ రెడ్డితో మాట్లాడి రైల్వే ఉన్నతాధికారులతో చర్చిస్తానని తెలిపారు. 

ఎంపీ వెంట జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​, కాంగ్రెస్​ నేతలు ఆళ్ల మురళి, నాగ సీతారాములు, ఊకంటి గోపాల్​ రావు, తోట దేవి ప్రసన్న, కోనేరు సత్యనారాయణ, ఆకునూరి కనకరాజు, రజాక్​, నాగేంద్ర త్రివేది, మేరెడ్డి జనార్దన్​రెడ్డి, జేవీఎస్​చౌదరి పాల్గొన్నారు. 

 

  • పెద్దమ్మతల్లికి పూజలు 

పాల్వంచ రూరల్, వెలుగు : పాల్వంచ మండల పరిధిలోని కేపీ జగన్నాథపురం పెద్దమ్మతల్లికి ఎంపీ రఘురాంరెడ్డి ఆదివారం ప్ర్యతేక పూజలు చేశారు. ఆలయ ఈవో ఎస్​ రజినికుమారి ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి శేషవస్త్రప్రసాదాలను అందజేశారు.