ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి : ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కృషి : ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
  • ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి 

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇస్తానని, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రైల్వే స్టేషన్ ను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్క లేటర్, ఎలివేటర్, ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పనులు నాణ్యతగా జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. 

కొత్తగా క్యాంటీన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రయాణికుల, అధికారుల వాహనాల పార్కింగ్ సమస్య తెలుసుకున్న ఎంపీ  స్టేషన్ సమీపంలో ఉన్న స్థలాన్ని కేటాయించేలా కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రయాణికుల ప్రయివేట్ పార్కింగ్ కేంద్రాన్ని సందర్శించి టోకెన్ ధరలు తెలుసుకున్నారు. అధిక రుసుమును తగ్గించేలా రైల్వే జీఎంతో మాట్లాడుతానని తెలిపారు.

 కాగా రైల్వే స్టేషన్ లోని పట్టాలపై ప్రమాద వశాత్తు పడిపోయిన మహిళా ప్రయాణికురాలితో ఎంపీ మాట్లాడారు. వెంటనే ఆమెను జిల్లా ప్రధాన ఆస్పత్రి తరలించాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ తో ఎంపీ ఫోన్ లో మాట్లాడి ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా  నాయకులు కొప్పుల చంద్రశేఖర్,  మైనార్టీ నాయకులు ఎండి. ముస్తఫా, నాయకులు మిక్కిలినేని నరేందర్,  అనంతరెడ్డి, ఉమ్మినేని కృష్ణ, పాపా నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

ముత్తయ్య కుటుంబానికి పరామర్శ

కూసుమంచి :  తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రేఖ ముత్తయ్య  ఇటీవల అనారోగ్య కారణంతో చనిపోయాడు.  సోమవారం జరిగిన  దశదినకర్మకు ఖమ్మం ఎంపీ హాజరై  ఆయన ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.