ఖమ్మం కార్పొరేషన్​ కాంగ్రెస్​ కైవసం!

ఖమ్మం కార్పొరేషన్​ కాంగ్రెస్​ కైవసం!
  • కారు’ దిగి కాంగ్రెస్​ లో చేరిన మేయర్ పునుకొల్లు నీరజ
  • మరో ఇద్దరు కార్పొరేటర్లూ మంత్రి తుమ్మల సమక్షంలో చేరిక
  • ఒకట్రెండు రోజుల్లో మరో ఆరుగురు చేరేందుకు సిద్ధం!

ఖమ్మం, వెలుగు:  ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ కాంగ్రెస్ వశమైంది. బీఆర్ఎస్​ కు చెందిన మేయర్​ పునుకొల్లు నీరజ శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్​ లో చేరారు. ఆమెతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు కొత్తపల్లి నీరజ (13వ డివిజన్), సరిపూడి రమాదేవి (11వ డివిజన్​) కూడా హస్తం పార్టీ జెండా కప్పుకున్నారు.

మేయర్​ కూడా పార్టీ మారడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికార పార్టీ వశమైంది. తాజాగా కార్పొరేటర్ల చేరికతో కాంగ్రెస్​ బలం 29 మందికి చేరింది. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎంకు ఇద్దరు చొప్పున కార్పొరేటర్లు కూడా ఉండడంతో సంఖ్యాబలంగా ఎలాంటి చిక్కులేదు. అయితే ఒకట్రెండు రోజుల్లో మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్​ ను వీడి కాంగ్రెస్​ లో చేరనున్నట్టు సమాచారం. 

మారిన బలాబలాలు..

మొత్తం 60 డివిజన్లున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్​ ఎన్నికల్లో బీఆర్ఎస్​ తరఫున 43 మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్ తరఫున 10 మంది కార్పొరేటర్లు, సీపీఐ తరఫున ఇద్దరు, సీపీఎం తరఫున ఇద్దరు, ఇండిపెండెట్లు ఇద్దరు చొప్పున గెలవగా, బీజేపీ ఒక డివిజన్​ ను గెల్చుకుంది. కార్పొరేషన్​ ఎన్నికల తర్వాత కాంగ్రెస్​ నుంచి ముగ్గురు కార్పొరేటర్లు బీఆర్ఎస్​ లో చేరారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇద్దరు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, 9 మంది బీఆర్ఎస్​ కార్పొరేటర్లు కాంగ్రెస్​లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడతల వారీగా బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​ లో చేరికలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మేయర్​ తో పాటు ఇద్దరు కార్పొరేటర్ల చేరికతో కార్పొరేషన్​ లో కాంగ్రెస్​ బలం 29కి చేరినట్టయింది. మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా ఇప్పటికే కాంగ్రెస్​ తో టచ్​లో ఉన్నారని, ఇవాళో రేపో వాళ్ల చేరిక కూడా ఉంటుందని కాంగ్రెస్​ నేతలు చెబుతున్నారు.