పట్టభద్రుల పోలింగ్ 72 % ..8 గంటలకు స్టార్ట్​.. 4 గంటలకు క్లోజ్

  • ప్రశాంతంగా ఖమ్మం- నల్గొండ- వరంగల్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
  • అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54  శాతం పోలింగ్​  
  • అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54  శాతం.. 
  • వివరాలు వెల్లడించిన రిటర్నింగ్​ అధికారి హరిచందన

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో ఖమ్మం–నల్గొండ– వరంగల్ ​గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బైపోల్​ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో మొత్తంగా 72.37 శాతం పోలింగ్​ నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లాలో 74.54  శాతం పోలింగ్​ రికార్డు కాగా.. అత్యల్పంగా ఖమ్మం జిల్లాలో 65.54  శాతం మంది పట్టభద్రులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 49 మంది పోటీలో ఉండగా కాంగ్రెస్‌‌ తరఫున తీన్మార్‌‌ మల్లన్న, బీఆర్ఎస్​ అభ్యర్థిగా రాకేశ్‌‌రెడ్డి, బీజేపీ తరఫున ప్రేమేందర్‌‌ ప్రధానంగా బరిలో నిలిచారు.  పోలింగ్​ వివరాలను ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన దాసరి వెల్లడించారు. 

8 గంటలకు స్టార్ట్​.. 4 గంటలకు క్లోజ్​

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బై పోల్​12 జిల్లాల్లో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసిందని హరిచందన తెలిపారు. 

12 జిల్లాల పరిధిలో 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు రిటర్నింగ్​ అధికారి హరిచందన చెప్పారు.  ప్రారంభంలో పోలింగ్ కొంత మందకొడిగా సాగినప్పటికీ అనంతరం ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారని వివరించారు. ప్రత్యేకించి పట్టభద్రులైన మహిళలు అధిక సంఖ్యలో హాజరై, ఓటేశారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు సాధారణ ఎన్నికలను మించి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పారు. 

ఓటేసిన 3.35 లక్షల మంది

మూడు ఉమ్మడి జిల్లాల్లో 4,63,839 మంది ఓటర్లకుగానూ పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 3,35,680 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు హరిచందన వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో 69.82  శాతం, జనగామ జిల్లాలో 71.60 , హనుమకొండ 71.21,  వరంగల్ 70.84, మహబూబాబాద్ 69.52, ములుగు 74.54,  జయశంకర్ భూపాలపల్లి 69.16, భద్రాద్రి కొత్తగూడెం 68.05, ఖమ్మం 65.54, యాదాద్రి భువనగిరి 67.45,  సూర్యాపేట 70.62, నల్గొండ జిల్లాలో 66.75 శాతం పోలింగ్​ నమోదైందని తెలిపారు.

ఖమ్మంలో మహిళలు అత్యధికంగా 21,543 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, నల్గొండలో 19,780 మంది ఓటేసినట్టు చెప్పారు. అన్ని జిల్లాల్లో పోలింగ్​ ప్రశాంతంగా జరిగిందని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని తెలిపారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్టు చెప్పారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎన్నికలు జరిగిన 12 జిల్లాల నుంచి పోలింగ్ శాతాన్ని సేకరించి

రాష్ట్రస్థాయిలో సీఈఓ కార్యాలయంతో పాటు మీడియాకు, ఇతర జిల్లాలకు చేరవేశామని తెలిపారు.  ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన అన్ని జిల్లాల ఎలక్షన్​ ఆఫీసర్లు, పోలీస్, రెవెన్యూ అధికారులు, ఇతర  సిబ్బంది, అభ్యర్థులు, మీడియాకు హరిచందన కృతజ్ఞతలు తెలిపారు.