ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో 40 ఏండ్ల కింద నిర్మించిన లైబ్రరీ ఓల్డ్ బిల్డింగ్ శుక్రవారం పునాదితో సహా కుప్పకూలింది. దీంతో ఈ బిల్డింగ్‌ను అనుకుని పక్కనే ఉన్న న్యూ బిల్డింగ్ లో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. ప్రమాదంతో బిల్డింగ్ లోపల ఉన్న విలువైన పుస్తకాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కుప్పకూలిన బిల్డింగ్‌లో రోజూ 70 నుంచి 100 మంది వరకు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే నిరుద్యోగులు, ఇతర వ్యక్తులు వస్తారని..శుక్రవారం ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని లైబ్రరీ స్టాఫ్ చెప్పారు.
ఇంతవరకు పని చేసిన గ్రంథాలయ సంస్థ చైర్మన్లు ఓల్డ్ లైబ్రరీ బిల్డింగ్‌ను డిస్ మ్యాంటిల్ చేయడంలో నిర్లక్ష్యం వహించారని, అందుకే ఇలా జరిగిందని విద్యార్థి సంఘాల లీడర్లు ఆరోపించారు. పీడీఎస్‌యూ జిల్లాకార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కోదాడ ఏరియాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఇక్కడ అద్దెకు ఉంటూ లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారని చెప్పారు. శుక్రవారం బిల్డింగ్ కూలినప్పుడు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. ఘటనపై విచారణ జరిపించాలన్నారు. విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల కుప్పకూలిన బిల్డింగ్ ను పరిశీలించారు. ఘటనకు కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.