- ముమ్మరంగా సహాయ చర్యలు
- పర్యవేక్షిస్తున్న మంత్రులు తుమ్మల, పొంగులేటి
- వరద ప్రభావిత డివిజన్లకు ప్రత్యేక అధికారులు
- మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా పంపిణీ
ఖమ్మం, వెలుగు : బురదతో నిండిన ఇండ్లు, వాకిళ్లు.. చెత్తాచెదారంతో కంపుకొడ్తున్న గల్లీలు.. కూలిన గోడలు.. వాటికి చిరిగి వేలాడుతున్న బట్టలు.. పక్కనే పనికిరాకుండాపోయిన ఇంటి సామాన్లు.. ఖమ్మంలోని మున్నేరు వరద ప్రభావిత కాలనీల్లో ఎటుచూసినా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా కాలనీల్లో వరద నీరు తొలగకపోవడంతో వందలాది మంది పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు.
ఓవైపు వరద మిగిల్చిన విషాదం నుంచి తేరుకునేందుకు బాధితులు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు బుధవారం ఉదయం మళ్లీ ముసురు అందుకోవడంతో ఖమ్మం నగరంలోని ముంపు కాలనీ వాసుల్లో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. మరో నాలుగు రోజులు వర్షాలుంటాయనే హెచ్చరికలతో వారిలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కడికక్కడ సహాయ చర్యలు
మున్నేరు ముంపు ప్రాంతాల్లో అధికారులు బుధవారం సహాయచర్యలను ముమ్మరం చేశారు. పునరావాస, సహాయ కార్యక్రమాలను స్వయంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా మున్నేరు పరీవాహక కాలనీల్లో సాధారణ పరిస్థితి తీసుకొచ్చేందుకు అధికారులు, ఖమ్మం మున్సిపల్‌కార్పొరేషన్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు, ఖమ్మం రూరల్ ప్రాంతంలోని కాలనీల్లో వరద బాధితులకు ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు. గత రెండు రోజులుగా అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, పలు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు.
ఎక్కడికక్కడ అన్నదాన క్యాంప్‌లను ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన పంచాయతీ ట్యాంకర్లతో మంచినీరు అందిస్తుండగా, వరద ప్రభావం లేని వేర్వేరు గ్రామాల నుంచి రప్పించిన పారిశుధ్య కార్మికులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బయటి ప్రాంతాల నుంచి రప్పించిన వారికి కూడా రిలీఫ్ క్యాంపుల్లోనే వసతి, భోజన సౌకర్యాలనూ ఏర్పాటుచేశారు.
బుధవారం ఉదయం ఒకవైపు వర్షం పడుతున్న సమయంలో కూడా పారిశుధ్య కార్మికులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. డోజర్ల ద్వారా రోడ్లపై పేరుకుపోయిన బురదను క్లీన్చేయడం, ట్యాంకర్ల ద్వారా నీళ్లు జల్లడం, అంటువ్యాధులు వ్యాపించకుండా బ్లీచింగ్ పౌడర్, దోమల ప్రభావం లేకుండా ఫాగింగ్ లాంటి చర్యలు చేపడుతున్నారు. ఖమ్మం నగరంలో వరద బాధిత 14 డివిజన్లకు సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించారు.
జనంలోనే మంత్రులు
ఖమ్మం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షిస్తున్నారు. రెగ్యులర్‌గా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితులకు ధైర్యం చెప్తున్నారు. బుధవారం వర్షంలోనే 48వ డివిజన్, కాల్వొడ్డు సారధినగర్‌లో ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాధితులకు సహాయ కిట్లను అందజేశారు. నిత్యావసర వస్తువులు, దుప్ప ట్లతో కూడిన కిట్లను వరద బాధితులకు తుమ్మల అందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, కారేపల్లి మండలాల్లో పర్యటించి వరద బాధితుల ను పరామర్శించారు.
దెబ్బతిన్న రోడ్లు, పంట పొ లాలను పరిశీలించారు. బాధితులకు పలుచోట్ల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నాయకన్‌గూడెంలో వరదల్లో చనిపోయిన షేక్ యాకూబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుమారులకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు.
కూసుమంచిలో ఇంటి స్థలాన్ని కేటాయిస్తామని, ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కారేపల్లి మండలం గంగారాంతండాలో చనిపోయిన మోతీలాల్, సైంటిస్ట్ అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించి.. రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి మంత్రి అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పత్రాన్ని అందజేశారు.
కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి : మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ. 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కట్టుకాసారం, చెరువుమాదారం, రామచంద్రాపురం, సుర్దేపల్లి గ్రామాల్లో వరద తీవ్రతతో కొట్టుకుపోయిన పంట పొలాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.5,438 కోట్లు మేర నష్టం జరిగిందని, దీన్ని గుర్తించి జాతి విపత్తుగా తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రానికి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఒకరోజు వేతనం విరాళం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవడానికి బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించారు. వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బందిపడుతున్న వారికి అండగా నిలుస్తామన్నారు. ఇప్పటి కే రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టామని.. దానికి తోడుగా నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తామని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.