ఖమ్మం టౌన్, వెలుగు : క్రీడలు ఐక్యతను చాటి చెబుతాయని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ‘పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ -2025’ ఖమ్మంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో ఆదివారం ఆయన ప్రారంభించారు.
తొలుత పోలీసు క్రీడాకారుల నుంచి సీపీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పావురాలను ఎగురవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. కమిషనరేట్ పరిధిలోని ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, వైరా, కల్లూరు సబ్ డివిజన్ల సివిల్ పోలీసులు, ట్రాఫిక్, ఆర్మ్ డ్ రిజర్వ్ ఫోర్స్, స్పెషల్ వింగ్స్ స్టాఫ్ మొత్తం 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
పురుషులకు, మహిళలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్నాయి. పురుషులకు 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందెంతో పాటు కబడ్డీ, షాట్‌పుట్, జావెలిన్, హైజంప్, లాంగ్ జంప్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు.
తొలిరోజు వాలీబాల్ పురుషుల విభాగంలో ఖమ్మం టౌన్ వర్సెస్ కల్లూరు టీమ్ ప్రారంభ మ్యాచ్ ను సీపీ ప్రారంభించారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ విజయ బాబు, ట్రైనీ ఐపీఎస్ రుత్విక్ సాయి, ఏసీపీలు ఉన్నారు.