- ఘనంగా 62వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం
ఖమ్మం టౌన్, వెలుగు: పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం 62 వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవాన్ని సిటీ పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సాయుధ హోంగార్డు ప్లాటూన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కవాతు పరిశీలించారు. పరేడ్ కమాండర్ గా ఇ. వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై, పోలీసులతో సమానంగా నిరంతరం విధులు నిర్వర్తిస్తూ హోంగార్డు ఆఫీసర్స్ అందిస్తున్న సేవలు అమోఘమన్నారు.
ఇటీవల ఖమ్మంలో భారీ వరదల సమయంలో తమ ఇల్లు సైతం వరద తాకిడికి గురై కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పటికి అంకిత భావంతో సమాజ సేవలో నిమగ్నమయ్యారని గుర్తుచేశారు. నిత్యం క్రమ శిక్షణతో మెలుగుతూ పోలీసుల ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. అనంతరం హోంగార్డుల స్పోర్ట్స్ మీట్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ నరేశ్ కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీలు సుశీల్ సింగ్, నర్సయ్య, హోంగార్డు ఆర్ఐ సురేశ్, శ్రీశైలం, అప్పలనాయుడు పాల్గొన్నారు.