
ఖమ్మం, వెలుగు: పోగొట్టుకున్న 48 మొబైల్ ఫోన్లను సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ (అడ్మిన్) నరేశ్‌కుమార్ తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. సుమారు రూ.7 లక్షల విలువ గల 48 ఫోన్లను ట్రేస్‌చేసి, యజమానులకు అప్పగించినట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు.
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 680 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు కాగా, 582 ఫోన్ల ట్రాక్ ను గుర్తించి 290 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. సెల్ ఫోన్ల రికవరీలో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్ ఏసీపీ వెంకటేశ్, ఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హేమనాథ్, కానిస్టేబుళ్లు నరేశ్, శ్రీనును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.