ఖమ్మం పోలీసుల సూపర్ ఐడియా: కోడిపందాల స్థావరాలు పసిగట్టేందుకు డ్రోన్ కెమెరాలు..

సంక్రాంతి అంటే ముత్యాల ముగ్గులు, పిండి వంటలు, పతంగులు, గంగిరెద్దులు, హరిదాసులు, పట్నం నుండి పల్లెకు వచ్చిన జనంతో కోలాహలంగా ఉంటుంది. ఇదంతా నాణేనికి ఒక వైపు అయితే.. కోడి పందాలు, పేకాట మరో వైపు అని చెప్పాలి. సంక్రాంతి పండుగ మూడురోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు, పేకాట స్థావరాల వద్ద కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. అనుమతి లేకుండా నిర్వహించే కోడిపందాలు అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా పందెం రాయుళ్లు పోలీసుల కళ్లుగప్పి కోడిపందాలు కోడిపందాలు నిర్వహిస్తూనే ఉంటారు.. ఈ క్రమంలో ఖమ్మం పోలీసులు కోడిపందాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలు వాడాలన్న వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు.

సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా చర్యలు చేపట్టారు ఖమ్మం పోలీసులు.  జిల్లా సరిహద్దులో టాస్క్ ఫోర్స్ బృందాలు మూడు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోడిపందాలను నియంత్రించేందుకు డివిజన్, మండల, గ్రామస్థాయిలో టీంలను ఏర్పాటు చేశామని.. కోడిపందాలు నిలువరించేలా పకడ్బంధీగా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు పోలీసులు.

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడిపందాలు, జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడకు వెళ్లి తగిన చర్యలు తీసుకునేలా ఆదేశించారు కమీషనర్. కోడిపందాలు, జూదం నిర్వహణకు తోటలు, భూములు, గెస్ట్ హౌస్ లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రోన్ కెమెరాల ద్వారా కోడి పందెలు, బెట్టింగ్, పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. గత సంవత్సరంలో కోడిపందేలు నిర్వహించిన వారిని, కత్తులు కట్టే వారిని గుర్తించి బైండోవర్ కేసులు నమోదు చేశామని... కోడిపందేల నిర్వహణ నిషేధంపై  గ్రామాల్లో ప్రజలకు అవగాహన  కల్పిస్తున్నామని తెలిపారు పోలీసులు.