- ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు
- అసెంబ్లీ ఎన్నికల్లో చేరినోళ్లూ పార్టీని వీడుతున్నరు
- అధినేత కేసీఆర్ కు సవాళ్ల స్వాగతం
ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఎదురీదుతోంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు ఖమ్మం పాలిటిక్స్ ఎప్పుడూ సవాల్ గానే మారుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ సొంతంగా సత్తా చాటుకునేందుకు కారు పార్టీ తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. 2014, 2018, 2023 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఉమ్మడి జిల్లాలో ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు. కారు గుర్తుపై 2014లో కొత్తగూడెంలో జలగం వెంకట్రావు గెలవగా, 2018లో ఖమ్మంలో పువ్వాడ అజయ్ విజయం సాధించారు. ఆ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో గెలిచిన ఐదుగురు
టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరడంతో అప్పుడు పార్టీ బలంగా కనిపించింది. మళ్లీ 2023 ఎన్నికల్లో భద్రాచలంలో తెల్లం వెంకట్రావు మాత్రమే గెలిచినా, ఆయన గత నెలలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. జిల్లాకు చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. వారిలో కూడా ఎంపీ బండి పార్థసారధిరెడ్డి పూర్తి స్థాయి పొలిటికల్ లీడర్ కాదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సత్తుపల్లి అసెంబ్లీకి ఎన్నికల ఇన్చార్జిగా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన జాడే కనిపించడం లేదు.
‘గుడ్ బై’లే ఎక్కువ!
బీఆర్ఎస్ లో కొత్తగా చేరికలు లేకపోగా, ఉన్నోళ్లే గుడ్ బై చెబుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినవారు మళ్లీ కాంగ్రెస్ బాట పడుతున్నారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, లీడర్లు కోనేరు చిన్ని, యడవెల్లి కృష్ణ, కామేపల్లి జడ్పీటీసీ ప్రవీణ్ నాయక్ రీసెంట్ గా కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా వారం కింద బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు సమాచారం.
ఈనెల 29న కేసీఆర్ రెండ్రోజుల పర్యటన కోసం ఖమ్మం వస్తున్నారు. ఏర్పాట్లలో ఇతర బీఆర్ఎస్నేతలు ఉండగా, పార్టీ ఆవిర్భావం రోజైన శనివారం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ కు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుకు రాజీనామా లేఖను పంపించారు. రెండ్రోజుల్లో కృష్ణచైతన్య రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు.
దాదాపు మూడు నెలల నుంచి కాంగ్రెస్ లో చేరేందుకు తగిన సమయం కోసం వెయిట్ చేస్తున్న చాలా మంది మాజీ ప్రజాప్రతినిధులు, మండల స్థాయి నేతలు ఇప్పుడు జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఖమ్మంలో 10 మంది వరకు కార్పొరేటర్లు, పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు అదే బాట పట్టనున్నారని సమాచారం.
వద్దిరాజే పెద్ద దిక్కు..
ఖమ్మం నగరానికి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాకు పెద్దదిక్కుగా మారారు. కేవలం రెండేళ్ల కాల పరిమితితో ముందుగా రాజ్యసభకు వెళ్లిన ఆయనకు, గత నెలలో మళ్లీ ఆరేళ్ల రెన్యూవల్ దొరికింది. రాష్ట్రంలో ఒక్కటే రాజ్యసభ సీటు బీఆర్ఎస్ కు దక్కగా, దాన్ని వద్దిరాజు రవిచంద్రకు కేసీఆర్ కేటాయించారు. పార్టీలో చేరిన కొన్నేళ్లలోనే బీఆర్ఎస్ అధినేతకు వీరవిధేయుడిగా రవిచంద్ర గుర్తింపు తెచ్చుకున్నారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా వ్యవహరించిన నేతలంతా ఓడిపోవడంతో ఇప్పుడు బాధ్యతంతా రవిచంద్రపై పడింది.
మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఇన్చార్జిగా ఉన్న ఆయన, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా మారారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సహా ఓడిన ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాలకే పరిమితమైన సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ప్రచార బాధ్యతలను రవిచంద్ర మోస్తున్నారు. ఖమ్మం పర్యటనకు వస్తున్న సందర్భంగా రవిచంద్ర ఇంట్లోనే కేసీఆర్ రేపు రాత్రి బస చేయనున్నారు. ఇక ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు మాత్రమే ఉమ్మడి జిల్లా నుంచి చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కేసీఆర్ కు సవాళ్ల స్వాగతమే..
గత పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 5,67,459 ఓట్లు సాధించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్కు 4,67,639 ఓట్లు వచ్చాయి. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ కు 7,33,293 ఓట్లు వచ్చాయి. ఈ నెంబర్లే ఖమ్మంలో పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
బీఆర్ఎస్ కు విజయావకాశాలు లేని సమయంలో అధినేత కేసీఆర్ ఖమ్మం వస్తుండడంతో పార్టీ కేడర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే పెద్ద సవాల్ గా మారనుంది. ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న వారిని కాపాడుకోవడం, పార్లమెంట్ ఎలక్షన్లకు, ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సిద్ధం చేయడం కూడా కేసీఆర్ ముందున్న పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు.