
- లిఫ్ట్ లు, ఎస్కలేటర్లు, ఏసీ వెయిటింగ్ హాళ్ల నిర్మాణం
- రెండేళ్ల క్రితం వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన
ఖమ్మం, వెలుగు: ఖమ్మం రైల్వే స్టేషన్ కొత్త సొబగులు దిద్దుకుంటోంది. నిజాం కాలం నాటి ఈ రైల్వే స్టేషన్‌లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్ వెయిటింగ్ లాంజ్, ఎస్కలేటర్లు, లిఫ్ట్లులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌలతులు ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు. రూ.25.41 కోట్లతో చేపట్టిన పనులు 45 శాతం పూర్తి కాగా, మొత్తం పూర్తయ్యేందుకు మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) కింద రాష్ట్ర వ్యాప్తంగా రూ. 2737 కోట్ల అంచనా వ్యయంతో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఖమ్మం స్టేషన్ ఒకటి. 19వ శతాబ్దంలో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే (ఎన్జీఎస్ఆర్) ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సుదీర్ఘకాలం తర్వాత అభివృద్ధి పనులు చేపట్టడంతో ప్రయాణికులకు లేటెస్ట్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
రెండేళ్ల క్రితం పనులు మొదలు
ఉమ్మడి జిల్లాలో ఖమ్మం, మధిర, భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) రైల్వే స్టేషన్లను ప్రస్తుతం డెవలప్ చేస్తున్నారు. వీటికి 2023 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అప్పుడు మొదలైన పనులు ఇటీవల కాలంలో కాస్త వేగంగా జరుగుతున్నాయి. రూ. 25.41 కోట్ల అంచనా వ్యయంతో ఏసీ వెయిటింగ్ హాల్, 2 ఎస్కలేటర్లు, 2 లిఫ్టులు, 12 మీటర్ల వెడల్పులో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టేషన్ బిల్డింగ్ ముఖద్వారం అభివృద్ధి, ఆకర్షణీయమైన ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయనున్నారు. వెయిటింగ్ హాల్, ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, పై కప్పు ఏర్పాటు, ఇప్పటికే ఉన్న టాయిలెట్లకు మెరుగుదల, దివ్యాంగుల సౌకర్యాలతో సహా కొత్త టాయిలెట్ బ్లాకుల నిర్మాణం చేపడుతున్నారు.
స్టేషన్ ఆవరణలో గ్రీనరీని పెంచడంతో పాటు, మన సంస్కృతిని చాటేలా పెయింటింగ్స్ వేయనున్నారు. ప్రయాణికులకు అనుకూలమైన సంకేతాలు, రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులు మొదలైనవి ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటివరకు 45 శాతం పైగా పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మిగిలిన పనులను కొద్దినెలల్లోనే పూర్తి చేస్తామని వివరిస్తున్నారు. మరోవైపు ఈ పనుల కారణంగా ప్లాట్ ఫామ్ ల మీద నీడలేక ఎండల సమయంలో ప్రయాణీకులు కొంత ఇబ్బంది పడుతున్నారు.
కీలకంగా ఖమ్మం స్టేషన్..!
ఖమ్మం రైల్వే స్టేషన్ లో దాదాపు 83 రైళ్లు ఆగుతాయి. ఇక్కడి నుంచి యావరేజీగా రోజుకు 13 వేల మంది ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏడాదికి ఈ స్టేషన్ ద్వారా రూ.29.64 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ స్టేషన్‌లో ముఖ్యమైన సూపర్ ఫాస్ట్ రైళ్లకు, న్యూఢిల్లీ, హౌరా, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, తిరుపతి వంటి అనేక గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కడ స్టాప్ ఉంది. హైదరాబాద్, విజయవాడ మధ్య రైలు రాకపోకల అనుసంధానానికి ఖమ్మం స్టేషన్ కీలకంగా ఉంటుంది.
బ్రిటిష్ కాలంలో ఉమ్మడి జిల్లాలోని గనుల నుంచి బొగ్గు, సున్నపురాయి, ఇతర ఖనిజాలను రవాణా చేయడంలో ఈ స్టేషన్ కీలక పాత్ర పోషించింది. స్వాతంత్ర్యం తర్వాత కొత్త రైళ్లను ప్రవేశపెట్టడంతో స్టేషన్ ప్రాముఖ్యత పెరుగుతూనే ఉంది. ఢిల్లీ, చెన్నై మధ్య రైల్వే లైన్ల జంక్షన్ లో వ్యూహాత్మకంగా ఉండి, ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య ప్రయాణించే రైళ్లకు అనుకూలంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పనులు పూర్తయితే ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.