రూ.22.69 కోట్లతో 697 స్కూళ్లలో వసతులు : ప్రియాంక అల

  •  ధరణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
  • టెన్త్​ ఎగ్జామ్స్​కు పక్కా ఏర్పాట్లు చేయాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో రూ. 22.69కోట్లతో 697 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు పనులు చేపట్టనున్నట్టు కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు. కలెక్టరేట్​లో స్కూళ్ల​ హెచ్ఎంలు, ఎంపీడీవోలు, ఇంజినీరింగ్​ విభాగాల అధికారులు, డీఆర్డీవోలతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 697 స్కూళ్లలో  అత్యవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనునున్నట్టు తెలిపారు. కరెంట్, డ్రింకింగ్​ వాటర్, బాలికల టాయ్​లెట్స్​ లాంటి వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు చెప్పారు.

జిల్లాలో గుర్తించిన 697 స్కూళ్లలో హెచ్​ఎం కన్వీనర్​గా, గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చైర్​ పర్సన్​గా, ప్రతి తరగతి నుంచి ముగ్గురి విద్యార్థుల ​తల్లులు కమిటీ సభ్యులుగా అమ్మ ఆదర్శ  పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల చైర్మన్​, హెచ్​ఎంల పేరుతో ఉమ్మడి బ్యాంక్​ ఖాతాను తెరవాలని హెచ్​ఎంలకు సూచించారు. కేటాయించిన నిధులను బ్యాంక్​ అకౌంట్లలో వేయనున్నట్టు తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద బాలికల టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి ఎస్టిమేట్లను వెంటనే అప్ లోడ్​ చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే హెచ్​ఎంలతో పాటు కమిటీ అధ్యక్షులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్​ హెచ్​ఎంలు  పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్​డీవో విద్యాచందన, డీఈవో వెంకటేశ్వరాచారి పాల్గొన్నారు. 

టెన్త్​ ఎగ్జామ్స్​ పక్కాగా నిర్వహించాలి 

జిల్లాలో టెన్త్​ ఎగ్జామ్స్​ పక్కాగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్​ ప్రియాంక అల ఆదేశించారు. ఎగ్జామ్స్​ సెంటర్లలో తాగునీరు, నిరంతర కరెంట్​ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. సెంటర్​లో ఆరోగ్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో వెంకటేశ్వరాచారి, ఎంపీడీవోలు, ఎంఈవోలు, హెచ్​ఎంలు  పాల్గొన్నారు. 

త్వరగా పరిష్కరించాలి..

ధరణి పెండింగ్​ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ధరణి దరఖాస్తులను వ్యక్తిగతంగా పరిశీలించాలని  ఆఫీసర్లను ఆదేశించారు. ఏడు రోజుల్లోగా పెండింగ్​లో ఉన్న ధరణి ఫిర్యాదులన్నింటిని క్లియర్​ చేయాలన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల కారణాలను చెక్​ లిస్ట్​లో నమోదు చేయాలని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మీ సేవ పెండింగ్​ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.

ప్రజా వాణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రాజెక్ట్​ల పెండింగ్​ భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇసుక రీచ్​లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్​ పరిధిలో పెండింగ్​లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ, సర్వే డిపార్ట్​మెంట్లు జాయింట్​ సర్వే చేపట్టాలని ఆదేశించారు. ప్రోగ్రాంలో జిల్లా అటవీశాఖాధికారి కృష్ణగౌడ్​,  డీఆర్వో రవీంద్రనాథ్,  ఆర్డీవోలు మధు, దామోదర్, స్పెసల్​ డిప్యూటీ కలెక్టర్​ కాశయ్య, ఏవో గన్యా పాల్గొన్నారు.