ఫోన్ లో బగ్గ తిట్టిండు..అందుకే నిద్ర మాత్రలు ఏస్కున్న

ఖమ్మం రూరల్ లో ‘బెల్లం వేణు’ బెదిరింపులు
దేవాదాయశాఖ మహిళా ఉద్యోగిపై హుంకరింపు
మారెమ్మ గుడి పాలక మండలి నోటిఫికెషన్ పై కన్నెర్ర

ఖమ్మం  దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో కలకలం రేగింది. కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ సమత ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు, రూరల్ ఎంపీపీ భర్త, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బెల్లం వేణు తనను ఇష్టం వచ్చినట్లు దూషించాడని మనస్తాపానికి గురై.. తన కార్యాలయంలోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే సహచర ఉద్యోగులు సమతను ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అసలేం జరిగింది..? 

మారెమ్మ గుడి కమిటీ విషయం గురించి దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ సమతకు ఖమ్మం రూరల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణు ఫోన్ చేశాడు. మారెమ్మ గుడి కమిటీ గురించి దేవాదాయశాఖ నోటిస్ బోర్డు, మండల ఆఫీసు,పేపర్ లోప్రకటన ఇచ్చామని సమత వివరణ ఇచ్చారు. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ వచ్చి కూడా 2, 3 నెలల సమయం అయ్యిందని చెప్పారు. అయితే.. తమకు ఎందుకు చెప్పలేదని, సీక్రెట్ గా నోటీసు వేస్తే ఎలా అని బెల్లం వేణు ప్రశ్నించారు. తమకు కూడా చెప్పాలి కదా..? అని ఫోన్ లో నిలదీశారు. సిక్రెట్ గా నోటీసు అంటించలేదని, ఓపెన్ గానే అందరికీ తెలిసేలా అంటించామని సమత చెబుతుండగా.. బెల్లం వేణు ఆగ్రహంతో ఊగిపోయాడు. తనపై విసుక్కోవడం సరైన పద్ధతి కాదని సమత సూచించారు. బెల్లం వేణు వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురైన సమత.. తమ ఆఫీసులోనే నిద్రమాత్రలు మింగారు. వేణు తనతో మాట్లాడిన తీరును సిబ్బందికి వివరిస్తూ బోరున విలపించారు. మహిళ అని కూడా చూడకుండా ఫోన్ లో తనను ఇష్టం వచ్చినట్లు తిట్టాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బెల్లం వేణుపై ఆరోపణలు

ఖమ్మం రూరల్ మండలంలో అధికారులందరూ తన చెప్పు చేతల్లో ఉండాలని, ఉండని వారిని  బెల్లం వేణు మరోచోటకు బదిలీలు చేయిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఓ మండల స్థాయి అధికారి బదిలీలో బెల్లం వేణు హస్తం ఉన్నట్లు  తెలుస్తోంది.