బీఆర్ఎస్​కు వెంపటి రవి రాజీనామా

ఖమ్మం రూరల్, వెలుగు : బీఆర్ఎస్​పార్టీకి ఖమ్మం రూరల్​మండల ఉపాధ్యక్షుడు వెంపటి రవి రాజీనామా చేశారు. పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, రూరల్​ ఎంపీపీ బెల్లం ఉమ వేధింపులు తాళలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మండలంలోని మారుతీనగర్​లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని నెలల నుంచి బెల్లం వేణు, ఉమ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, గ్రూపు రాజకీయాలను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదన్నారు.

ఈ విషయాన్ని ఎమ్మెల్యే కందాల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదని తెలిపారు. తమను మానసికంగా, ఆర్థికంగా వేధిస్తుండటంతోనే పార్టీకి రాజీనామా చేశామని  చెప్పారు. తనతో పాటు ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు వడ్లకుండ భుజంగరావు, పార్టీ శ్రేణులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో  చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన వెంట వరంగల్ క్రాస్ రోడ్ కాంగ్రెస్ ఇన్​చార్జ్ భూక్య సురేశ్​నాయక్,  నాయకులు వెంపటి వెంకన్న, ప్రతిమాచారి, వెంపటి కోటయ్య, మాతంగి వినోద్, సురేశ్​రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు.

చండ్రుగొండలో ఏడుకొండలు..

చండ్రుగొండ, వెలుగు : బీఆర్ఎస్ చండ్రుగొండ మండల ప్రధానకార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు  200 మంది అనుచరులతో కలిసి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీసీ సామాజిక వర్గాలకు అందలేదని తెలిపారు. బీఆర్​ఎస్​మండల అధ్యక్షుడు ఒంటెత్తు పోకడలు పోతూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.

ఈ విషయమై ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు చెప్పినా పట్టించుకోకపోవడంతో పార్టీ పై విరక్తి చెంది తన అనుచరులతో మూక్కుమ్మడిగా రాజీనామాలు చేసినట్టు తెలిపారు. రాజీనామా పత్రాలను పార్టీ మండల అధ్యక్షుడు, ఎమ్మెల్యేకు పంపినట్టు చెప్పారు. త్వరలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నట్టు ప్రకటించారు.