- త్వరలో బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి?
- కేడర్‌ను కాపాడుకునే పనిలో కేసీఆర్
- ప్రగతిభవన్‌లో సమావేశం.. కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు డుమ్మా
- ఖమ్మం బహిరంగ సభకు ఇన్‌చార్జులుగా హరీశ్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్‌కు ఖమ్మం టెన్షన్ పట్టుకుంది. ఉమ్మడి జిల్లా కీలక నేతలు కారు దిగుతుండటంతో వారి వెంట బీఆర్‌ఎస్ కేడర్ వెళ్లిపోతుందేమోనని హైరానా పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలకనేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీని వీడటం దాదాపు ఖాయమైందని, తన వెంట పది నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే స్థాయి నేతలను తీసుకెళ్తారని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. ఇదే క్రమంలో సోమవారం ప్రగతిభవన్‌లో కేసీఆర్ నిర్వహించిన ఖమ్మం నేతల కీలక సమావేశానికి ఇద్దరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఓ ఎమ్మెల్యే మీటింగ్ చివర్లో అక్కడికి చేరుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే సమావేశానికి హాజరు కాలేదని వాళ్లు చెప్తున్నా.. పార్టీలో ఇంకా ఏదో జరుగుతున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో పార్టీకి పట్టు లేకపోయినా..!
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఏ ఎన్నికల్లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పెద్దగా ఆ పార్టీకి సీట్లు రాలేదు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే కారు గుర్తుపై గెలిచారు. తర్వాత ఇతర పార్టీల్లోని ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరినా.. వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టుగా సర్వేల్లో తేలినట్టు సమాచారం. ఉన్న ప్రజాప్రతినిధులపై నెగెటివ్ ఉండటం, కీలక నేతలు పార్టీకి దూరమవుతుండటంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు. ఈక్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సోమవారం ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. మూడు గంటలకుపైగా సాగిన సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. పొంగులేటి పార్టీ వీడినా కీలక నేతలు, కేడర్ పార్టీ వీడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టుగా సమాచారం. ఈ సమావేశానికి కొత్తగూడెం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్ రావు, మెచ్చ నాగేశ్వర్‌రావు హాజరుకాలేదు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు నామ నాగేశ్వర్‌రావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
18న భారీ బహిరంగ సభ
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇప్పటికే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించి టీడీపీ ప్రభావం ఇంకా ఉందని చాటుకునే ప్రయత్నం చేశారు. 2018 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా ఈ జిల్లావే కావడంతో ఖమ్మంపై చంద్రబాబు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. పొంగులేటి బీఆర్ఎస్ను వీడి బీజేపీ గూటికి చేరితే కమలం ప్రాబల్యం జిల్లాలో పెరిగే అవకాశముంది. ఈ జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం కూడా బలంగానే ఉంది. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మంపై కేసీఆర్ దృష్టి సారించారు. ఈ నెల 18న ఖమ్మం శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ, జార్ఖండ్ సీఎంలు అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, హేమంత్ సోరెన్, మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, కుమారస్వామిని సమావేశానికి ఆహ్వానించారు. వీరితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఖమ్మం బహిరంగ సభను సక్సెస్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్న కేసీఆర్ సభ ఇన్‌చార్జులుగా మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3 లక్షల మంది, సరిహద్దు జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న ఏపీ నుంచి ఇంకో రెండు లక్షల మందిని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి సమావేశం కావడంతో కనీవినీ ఎరుగని రీతిలో సభ సక్సెస్ చేయాలని కేసీఆర్ సూచించారు. ఖమ్మంలో నిర్వహించే ఈ బహిరంగ సభలోనే బీఆర్‌ఎస్ ఎజెండా, విధివిధానాలపై కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు.
బీజేపీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్ కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఆయనతో బీజేపీ కేంద్ర నాయకత్వం నేరుగా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తున్న ఈ నెల 18 నే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలిసింది. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నేతలతో మంగళవారం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహించనున్నారు. పినపాకలో భారీ బహిరంగ సభతో తన ప్రాబల్యం ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించడంతోపాటు మరో ముగ్గురిని ఎమ్మెల్యేలుగా గెలిపించారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ ఏపీకే పరిమితం కావడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 2019లో సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కాకుండా టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావును తీసుకువచ్చి గులాబీ పార్టీ టికెట్ ఇచ్చింది. న్యూ ఇయర్ సందర్భంగా తన సన్నిహితులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో నాలుగేండ్లలో తనకు ఏం ప్రాధాన్యత దక్కిందో అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన సన్నిహితులంతా పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ కామెంట్స్ గులాబీ పార్టీ లో కాక పుట్టించాయి. ఆ తర్వాతి రోజే రాష్ట్ర సర్కారు పొంగులేటికి భద్రత తగ్గించింది. ఆదివారం నిర్వహించిన మరో సమావేశంలో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నానని ఆయన కామెంట్స్ చేశారు. దీంతో పార్టీ మార్పు ఖాయమనే సంకేతాలు ఇచ్చారు.