రైల్వే గేట్​ బంద్​తో తిప్పలు

రైల్వే గేట్​ బంద్​తో తిప్పలు
  • ఖమ్మం వన్​టౌన్, త్రీ టౌన్ మధ్య రాకపోకలకు ఇబ్బంది​ 
  • నష్టపోతున్న వ్యాపారులు 

ఖమ్మం, వెలుగు: ఖమ్మం నగరంలో రైల్వే మధ్య గేట్ మూసివేతతో అక్కడి వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. వన్​టౌన్, త్రీ టౌన్​ ప్రాంతాలను కలిపే ఈ గేట్ ను మూసేసి, 2 నెలలవుతోంది. మూడో రైల్వే లైన్ పనులు చేపడుతుండటమే ఇందుకు కారణం. ఈ గేటుకు ఒకవైపు కస్బా బజార్, రావిచెట్టు బజార్ ఉండగా ఇక్కడే వందల సంఖ్యలో హోల్ సేల్ వస్త్ర దుకాణాలు, స్టీల్, అల్యూమినియం షాపులున్నాయి. మరోవైపు గాంధీ చౌక్​లో  బంగారం, కిరాణా దుకాణాలున్నాయి. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్ల కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తుంటారు. 

 ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం జరిగే గాంధీ చౌక్​ ప్రాంతంలో కీలకంగా ఉండే మార్గాన్ని మూసివేయడంతోపాటు, తాజాగా మరో మూడు, నాలుగు నెలలపాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పడంతో వ్యాపారులు ఆందోళన బాట పట్టారు.  అండర్​ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.  గాంధీ చౌక్​ నుంచి కమాన్​బజార్, కస్బా బజార్​ మధ్య రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. వ్యాపారులు, ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తాజాగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​ను కలిసి, అండర్​ బ్రిడ్జి నిర్మించాలని
 కోరారు. 

గాంధీ చౌక్​ నుంచి ర్యాలీ

రైల్యే మధ్య గేట్​ను మూసివేయడాన్ని నిరసిస్తూ మంగళవారం త్రీటౌన్​పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆర్జేసీ కృష్ణ, బీజేపీ నాయకుడు ఉదయ్​ ప్రతాప్​ ఆధ్వర్యంలో నాయకులు గాంధీచౌక్ నుంచి మధ్య గేట్​వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత రైల్యే డిప్యూటీ చీఫ్​ఇంజినీర్​ రామారావుకు వినతిపత్రం అందించారు. మధ్య గేట్​ వద్ద ఆర్​యూబీ నిర్మించాలని కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాడి, 8 మీటర్ల వెడల్పుతో అండర్​ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిస్తామని మేనేజర్ హామీ ఇచ్చారు.