విరాసత్​ కావట్లే.. రైతుబంధు రావట్లే

  •     ఐటీడీఏకు మ్యుటేషన్​ లాగిన్ ఇవ్వని సర్కారు
  •     ఆందోళనలో 300మంది బాధితులు
  •     సంస్థ కార్యాలయం చుట్టూ గిరిజనుల ప్రదక్షిణలు
  •     స్పందించని అగ్రికల్చర్​ఆఫీసర్లు

భద్రాచలం, వెలుగు : ‘ధరణి’లో ఐటీడీఏకు భూముల మ్యుటేషన్​ చేసేందుకు లాగిన్​ ఇవ్వకపోవడంతో గిరిజన, ఆదివాసీ రైతులకు రైతుబంధు అందేలా లేదు. తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులకు పోడు భూముల పట్టాలను బదలాయించే ప్రక్రియతోపాటు రైతుబంధు అప్​డేట్​కు బ్రేక్ పడింది. ఈ కారణంగా నిత్యం గిరిజనులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఐటీడీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఆఫీసర్లు మాత్రం స్పందించడంలేదు.

 నిరీక్షణతో రైతులకు ఇబ్బందులు..

పట్టాదారులు చనిపోవడంతో వారి వారసులు తమ పేరు మీదుగా రైతుబంధు ఐడీని మార్చుకునేందుకు ఐటీడీఏ వద్దకు వస్తున్నారు. ఇలాంటి వారు సుమారు 300 మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 2021 నవంబరు 20న లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన రుణావత్​క్రాంతి చనిపోయింది. అప్పటి వరకు ఆమె పేరునే పోడు భూమికి రైతుబంధు వచ్చేది. తర్వాత 2022లో రైతుబంధు ఆగిపోయింది. అప్పటి నుంచి తమకు ఆ రైతుబంధు నగదు ఇవ్వాలంటూ ఆమె కుమారుడు వీరన్న స్థానికంగా ఉన్న ఆఫీసర్లను కలుస్తూనే ఉన్నాడు. ఏఈవో తమ వద్ద కాదు ఐటీడీఏకు వెళ్లాలంటూ సూచించారు. దీంతో వీరన్న భద్రాచలం ఐటీడీఏ ఆఫీసులో సంప్రదించాడు. 

కానీ ఈ సంవత్సరం ఐటీడీఏకు మార్పులు, చేర్పులు చేసుకునేందుకు లాగిన్​ ఇవ్వలేదు. దీంతో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 300 మంది ఐడీని మార్చుకునేందుకు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. చనిపోయిన వారి ఐడీని రద్దు చేసి, ఆ స్థానంలో వారసుల పేరును చేర్చి కొత్తగా ఐడీని ఐటీడీఏ తయారు చేసి అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్​కు పంపితే ఆగిన రైతుబంధు నగదు వస్తుంది. కేవలం అగ్రికల్చర్​డిపార్ట్​మెంట్​నిర్లక్ష్యం కారణంగానే గిరిజన రైతులకు ఈ పరిస్థితి దాపురించింది. ఐటీడీఏకు పోర్టల్ లాగిన్​ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనేది అందరి వాదన.

పీవో దృష్టికి సమస్య...

సమస్య తీవ్రతరం కావడంతో ఐటీడీఏలోని ఆర్ఓఎఫ్ఆర్(అటవీ హక్కుల చట్టం) విభాగం ఆఫీసర్లు ఐటీడీఏ పీవో గౌతమ్​పోట్రు దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన రైతుల సమస్యను వివరించారు. పోర్టల్ లాగిన్ ఇవ్వకపోవడం కారణంగా పోడు రైతుల ఐడీని మార్చలేక పోతున్న విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆయన అగ్రికల్చర్​ఆఫీసర్లతో మాట్లాడారు. పోర్టల్ లాగిన్​ఇవ్వాలని కోరారు. 

తిరగలేకపోతున్నం.. ఆదుకోండి..

2020 వరకు మా అమ్మ రుణావత్ క్రాంతి పేరున రైతుబంధు డబ్బులు వచ్చినయి. అమ్మ చనిపోయాక డబ్బులు రావట్లే. ఆఫీసర్లను అడిగితే పేరు మార్చుకోవాలంటున్నరు. అక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ అంటే అక్కడ అని ఆఫీసర్లు తిప్పుకుంటున్నరు. మమ్మల్ని ఆదుకోండి. తిరగలేక పోతున్నం. విత్తనాలకు సాయపడతయనుకుంటే ఆదరువు కాస్త దూరమైతంది.

–రుణావత్​వీరన్న, రేగళ్ల