ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం అర్బన్ మండలం ఎంఎల్ఎస్(మండల లెవల్ స్టాక్) పాయింట్ ను హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్ మెంట్ ఓఎస్డీ అంజయ్య, ఎమ్మార్వో పాషా, సివిల్ సప్లై డీటీ విజయ్ బాబు, టాస్క్ ఫోర్స్ ఎస్సై తో కలిసి శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గోడౌన్ ఆర్ఐ మాధవి వద్ద ఉన్న స్టాక్ వివరాలను పరిశీలించారు. మిడ్డే మీల్స్, హాస్టల్స్, ప్రజాపంపిణీ షాపులకు ఎంతెంత బియ్యం సప్లై అవుతోందో అడిగి తెలుసుకున్నారు. గోడౌన్ లో సీసీకెమెరాలు పనిచేయక పోవడం, నిర్వహణ సరిగా సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
12 వందల మెట్రిక్ టన్నుల బియ్యం 121 రేషన్ షాపులకు సప్లై అయ్యే గోడౌన్ నిర్వహణ సక్రమంగా లేదని, ఆయన సివిల్ సప్లై జిల్లా ఉన్నతాధికారి పై అసహనం వ్యక్తం చేశారు. 2021 నుంచి సీజ్ చేసిన నాలుగు లారీల బియ్యాన్ని సకాలంలో వేలం వేయకుండా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మట్టిపాలు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు రోజులుగా 10 రేషన్ షాపుల్లోని బియ్యం అలాట్ మెంట్ ను తనిఖీ చేసినట్లు చెప్పారు.
ఈ తనిఖీలో మేదర్ బజార్ లో డీలర్ గా వ్యవహరిస్తున్న లాల్ జానీ పాషా షాపులో 30 క్వింటాలు, మరో షాపులో 40 బస్తాల తేడాను గుర్తించినట్లు తెలిపారు. అ రెండు షాపులపై సివిల్ సప్లై అధికారులు పంచనామా చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని డీటీని ఆదేశించినట్లు తెలిపారు.