- ఫండ్స్కొరత, అధికారుల నిర్లక్ష్యం వల్లే లేటు
- జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒక్కటే పూర్తి
- మిగిలిన వాటికి టైం పట్టే అవకాశం
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు స్లోగా సాగుతున్నాయి. గతేడాది ప్రారంభమైన పనులు బేస్మెంట్దశను దాటలేదు. ఖమ్మం నగరంలోని వీడీవోస్ కాలనీలో నిర్మిస్తున్న మార్కెట్ మాత్రమే కంప్లీట్ అయి ప్రారంభానికి రెడీ అవుతోంది. ఫిబ్రవరి 10న ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన వాటిలో కొన్నింటికి ఫండ్స్కొరత, ఇతర కారణాలతో పనులు ఆలస్యమవుతున్నాయి. మూడు నాలుగు నెలల్లోగా అన్ని మార్కెట్లు కంప్లీట్ చేసి, ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. గతంలో వీటికి ఒక్కోదానికి రూ.నాలుగున్నర కోట్లు అంచనా వేయగా.. ప్రస్తుతం ధరలు పెరగడంతో నిర్మాణం, వసతుల కల్పన ఖర్చు రూ.7 కోట్లకు చేరుతుందని ఆఫీసర్లు లెక్కలేస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు ప్రపోజల్స్ పంపించినట్టు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే డిజైన్‌లో నిర్మిస్తుండడంతో, రివైజ్డ్ ఎస్టిమేషన్లకు ప్రభుత్వం నుంచి జీవో ఇవ్వాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
జిల్లాలో ఐదు మార్కెట్ల నిర్మాణం
ఖమ్మం జిల్లాలో ఐదు ఇంటిగ్రెటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలో రెండు, మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల్లో ఒక్కోటి చొప్పున నిర్మిస్తున్నారు. 2021లోనే ఖమ్మం కొత్త బస్టాండ్ పక్కన ఒక మార్కెట్ ప్రారంభం అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో పనులు జరుగుతున్న అన్ని మార్కెట్లకు ఒకటే డిజైన్‌తో నిర్మిస్తున్నారు. వీడీవోస్ కాలనీలో ఏసీపీ ఆఫీస్ వెనుక 2.05 ఎకరాల్లో నిర్మిస్తున్న మార్కెట్ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. బేసిక్ స్ట్రక్చర్కు అవసరమైన ఫండ్స్ ప్రభుత్వం మంజూరు చేయగా.. మిగిలిన రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, ఆర్చి, ఎలివేషన్ ఇతర పనుల కోసం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ కేటాయిస్తున్నారు. దీన్ని రూ.9 కోట్లతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో ప్రారంభించేలా దీన్ని రెడీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ డిజైన్‌లో నిర్మిస్తున్న మొదటి మార్కెట్ కావడంతో ఇతర జిల్లాల నుంచి కూడా మున్సిపల్ అధికారులు, పాలకవర్గాలు వచ్చి ఇక్కడి పనులను చూసి వెళ్తున్నారు. ఇక ఇల్లందు రోడ్లో నిర్మిస్తున్న మార్కెట్ ఒకటో అంతస్తు పూర్తికాగా, రెండో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు. కనీసం పని పూర్తయ్యేందుకు మూడు నెలలు పడుతుందన్న అంచనాలున్నాయి.
మున్సిపాలిటీల్లో ఇదీ పరిస్థితి..
వచ్చే నెల రెండోవారంలో మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనకు రానున్నారు. దీంతో మధిర మున్సిపాలిటీలో నిర్మిస్తున్న మార్కెట్ ను కూడా ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎకరం స్థలంలో నిర్మిస్తుండగా, ప్రస్తుతం రెండంతస్తులు శ్లాబ్ పూర్తి కాగా, మరో మూడు వారాల్లో మాత్రం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వైరా మున్సిపాలిటీలో రెండెకరాల్లో మార్కెట్ ను నిర్మిస్తున్నారు. గత నెలలోనే కంప్లీట్ కావాల్సి ఉండగా, పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మార్చి చివరి వరకు కంప్లీట్ అవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. సత్తుపల్లి లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ భవనం మాత్రం ఇంకా బేస్‌మెంట్ లెవల్‌లోనే ఉన్నాయి. మాంసం, చేపల విక్రయాలకు సరైన వసతి లేక వ్యాపారులు పట్టణంలోని రోడ్ల వెంట అమ్ముతున్నారు. ఇప్పటికైనా పనుల్లో స్పీడ్ పెంచితే నాలుగైదు నెలల్లో పనులు కంప్లీట్ చేసే అవకాశమున్నా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో
వర్క్ ముందుకు సాగడం లేదు.
పనులు కొనసాగుతున్నాయి
ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ల ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. వచ్చే నెలలో ఖమ్మంలో ఒక మార్కెట్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా మార్కెట్ల పనులను రెండు మూడు నెలల్లో కంప్లీంట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం.
–రంజిత్ రెడ్డి, ఈఈ, పబ్లిక్ హెల్త్