- కన్నీరుమున్నీరైన పెండ్లికూతురు
- భద్రాద్రి కొత్తగూడెంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: పిల్లల పెండ్లిని దగ్గరుండి జరిపించాలని తల్లిదండ్రులు.. తల్లిదండ్రుల సమక్షంలో పెండ్లి చేసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవాలని పిల్లలూ ఆశపడ్తారు. కానీ, అందరికీ ఆ అదృష్టం ఉండదు. వివిధ కారణాలతో తల్లినో, తండ్రినో కోల్పోయినవారి బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా వివాహ సమయంలో వారు లేని లోటును తలుచుకొని పిల్లలు కన్నీటిపర్యంతమవుతుంటారు.
అయితే, భద్రాద్రి కొత్తగూడెంలో ఓ తమ్ముడు తన అక్క పెండ్లిలో నాన్నలేని లోటును తీర్చాలనుకున్నాడు. ఇందుకోసం నాన్న మైనపు బొమ్మను తయారుచేయించి, అక్కకు గిఫ్టుగా తీసుకురావడంతో ఆ పెండ్లి కూతురుతో పాటు ఆమె తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీపై ఆ దృశ్యాన్ని చూసి పెండ్లి వేడుకలోనూ ఉద్విగ్నభరిత వాతావరణం చోటు చేసుకుంది. తండ్రి మైనపు విగ్రహాన్ని స్టేజీపై ఉంచి ఆ కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలిచి వేసింది.
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న స్నేహకు సింగరేణిలో ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్న టి. అవినాశ్‌తో శుక్రవారం రాత్రి కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో గల సింగరేణి గెస్ట్‌హౌస్ ఆవరణలో పెండ్లి జరిగింది. పెండ్లి కూతురు స్నేహ తండ్రి పెడకం బాలరాజు సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ ఐదేండ్ల కింద హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. స్నేహను సర్ప్రైజ్చేయాలనుకున్న ఆమె తమ్ముడు మనోజ్.. మైనంతో తండ్రి బాలరాజు విగ్రహాన్ని తయారు చేయించాడు.
పెండ్లి తంతు పూర్తయ్యాక స్టేజీపైకి బాలరాజు మైనపు బొమ్మను తీసుకొచ్చి కుర్చీలో ఉంచాడు. ఆ దృశ్యాన్ని చూసి పెండ్లి కూతురు ఒక్కసారి భావోద్వేగానికి గురైంది. ఆమె తల్లి కళావతి కూడా చేరుకొని కన్నీటిపర్యంతమయ్యారు. వరుడు చేరుకొని వధువును ఓదార్చాడు. అనంతరం వధువు స్నేహ, వరుడితో కలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది. ఈ దృశ్యాలు శనివారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.