కేసీఆర్​ను విమర్శిస్తే సీఎం అవ్వరు : కమల్​రాజ్ 

మధిర/ఎర్రుపాలెం, వెలుగు : కేసీఆర్​ను విమర్శిస్తే తాము కూడా సీఎం స్థాయికి ఎదుగుతామని కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఖమ్మం జడ్పీ చైర్మన్​లింగాల కమల్​రాజ్​అన్నారు. అలా అనుకుంటే పొరపాటేనని చెప్పారు. మధిర వ్యవసాయ మార్కెట్​లో శుక్రవారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమల్​రాజ్​మాట్లాడుతూ.. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభానికి  రాలేనంత బిజీగా ఉన్నారని విమర్శించారు. కొందరు పంది బలిస్తే ఏనుగు అవుతుంది అని అపోహలో ఉన్నారని, పంది పందే.. ఏనుగు ఏనుగే అని ఎద్దేవా చేశారు.

సీఎం ఫాంహౌస్​లోనే పడుకుంటే రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలయ్యేవా అని ప్రశ్నించారు. అంతకు ముందు ఖమ్మంపాడులోని స్కూల్​లో సీఎం బ్రేక్​ఫాస్ట్​కార్యక్రమాన్ని కమల్ రాజ్​ప్రారంభించారు. జిల్లా అడిషినల్ కలెక్టర్ మధు సూదన్ నాయక్,  మధిర ఎంపీపీ మెండెం లలిత, వైస్ ఎంపీపీ సామినేని సురేశ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే ఎర్రుపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, స్పోర్ట్స్​కిట్లు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కమల్​రాజ్​పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిఒక్కరూ బీఆర్ఎస్​కు ఓటేయాలని కోరారు.