ఇష్టారాజ్యంగా ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు

  •     ఖమ్మం బైపాస్​మీదుగా     గ్రావెల్ తరలింపు
  •     వందల టిప్పర్లు, లారీల్లో     మట్టి రవాణా 
  •     గ్రీన్​ఫీల్డ్ హైవే నిర్మాణానికి వినియోగం 
  •     ప్రయాణికులకు తప్పని తిప్పలు
  •     పట్టాలు కప్పాలంటున్న వాహనదారులు

ఖమ్మం, వెలుగు: ఖమ్మం – దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు నగర వాసులను ఇబ్బంది పెడుతున్నాయి. పొన్నెకల్, మద్దులపల్లి నుంచి కొత్తగా జాతీయ రహదారి నిర్మాణ పనులు రెండు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. పంట పొలాలను సేకరించి రోడ్డు నిర్మాణం చేస్తుండడంతో సుమారు 20 అడుగుల ఎత్తులో, 100 మీటర్లకు పైగా వెడల్పులో నాలుగు లేన్ల హైవే నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తులో రోడ్డు నిర్మాణం కోసం అవసరమైన మట్టిని ప్రతి రోజూ వందల సంఖ్యలో టిప్పర్లు, డంపర్లతో నగరం మీదుగా తరలిస్తున్నారు. రఘునాథపాలెం మండలం శివాయిగూడెం, ఉదయ్ నగర్ సమీపంలో పదుల సంఖ్యలో జేసీబీలతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్​సర్కిల్, కొత్తబస్టాండ్, బైపాస్ రోడ్డు, వరంగల్ క్రాస్​రోడ్ మీదుగా నగరంలో నుంచి మట్టిని తరలించే వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా వందల ట్రిప్పులు వెళుతుండడంతో వాటి వెనుక ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓవర్ స్పీడ్​కారణంగా లారీల వెనుక ఉన్న బైక్ లు నడిపేవారి కళ్లలో దుమ్ముపడుతోంది. దీంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. పగటి సమయంలో గాలికి దుమ్ములేవకుండా లారీలపై పట్టాలు కప్పి నడిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.

సర్వీసు రోడ్డు వేయాల్సిందే...

రెండు నెలలుగా పనులు సాగుతుండగా, ఇప్పటి వరకు దాదాపు 30 వేల ట్రిప్పుల మట్టిని తరలించి ఉంటారన్న అంచనాలున్నాయి. పనుల ప్రారంభ సమయంలో దాదాపు వారం రోజులపాటు మద్దులపల్లి నుంచి లారీలను తరలించడంతో గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. భారీ లోడ్ల కారణంగా తమ గ్రామంలోని అంతర్గత రోడ్లు డ్యామేజీ కావడంతోపాటు, ఇండ్లపై కూడా దుమ్ము పేరుకుపోతుందంటూ చెప్పారు. దీంతో పొన్నెకల్లు మీదుగా ప్రస్తుతం లారీలను నడిపిస్తున్నారు. ఇక గ్రీన్ ఫీల్డ్ హైవే కారణంగా మరో సమస్యను కూడా ఎదుర్కొంటున్నామని స్థానికులు చెబుతున్నారు. భూసేకరణ సమయంలో కొంత భూమిని సేకరించగా, మిగిలిన భూమి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న రోడ్డుకు రెండు వైపులా ఉండడంతో ఆ పొలాలు, చెలకలకు వెళ్లేందుకు తమకు సర్వీస్ రోడ్డు వేయాలని డిమాండ్​చేస్తున్నారు. పంటను తెచ్చుకునేందుకుగానీ, పొలాలకు వెళ్లేందుకు గానీ దారి లేదని, సర్వీస్ రోడ్డు వేస్తేనే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరిస్తున్నారు. అధికారులు మాత్రం ఒకట్రెండు చోట్ల అండర్ పాస్ లు నిర్మిస్తామని, వాటిని ఉపయోగించుకోవాలని అంటున్నారు.  

రైతుల ఇబ్బందులు పట్టించుకోరా..

దేవరపల్లి దహదారి కింద భూములు పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇన్నేళ్లు ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోగా ఇప్పుడు భూములు రెండుగా చీలిపోయినయి. రోడ్డు అవతలివైపు వెళ్లాలంటే చుట్టూ తిరిగి రావాల్సిన వస్తోంది. అధికారులను తాము ఎన్నిసార్లు అడిగినా ఫలితం లేదు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని తమ ఇబ్బందులను గుర్తించి సర్వీస్ రోడ్డు వేయాలి
- అంబటి సుబ్బారావు, రైతు, మద్దులపల్లి.