నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్దు అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2008,1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. సీపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ పద్ధతిని తీసుకొస్తామన్నారు.

ప్రతినెల సక్రమంగా వేతనం ఇవ్వకుండా ఉద్యోగులను, నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ హక్కుతో ఓటు అడిగేందుకు వస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే  బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మల్లన్నకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిర్యాలగూడ నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. మల్లన్నకు సీరియల్ నెంబర్–2 లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ లీడర్లు చిలుకూరి బాలకృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, తలకొప్పులు సైదులు, గాయం ఉపేందర్ రెడ్డి, బెజ్జం సాయి, సిద్దు, నందిని ఉన్నారు.

మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలి

హాలియా: నల్గొండ-– ఖమ్మం–- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ప్రతీ కాంగ్రెస్ ​కార్యకర్త కృషి చేయాలని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నల్గొండ జిల్లా హాలియాలోని లక్ష్మీనర్సింహ గార్డెన్స్​లో నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల సన్మాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జానారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు ఎలాగైతే పనిచేశారో తీన్మార్ మల్లన్నకు అండగా ఉంటూ విజయం కోసం అదే విధంగా కృషి చేయాలన్నారు. మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి,  రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, జడ్పీ వైస్​చైర్మన్​ఇరిగి పెద్దులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా లీడర్లు  కాకునూరు నారాయణగౌడ్, రావుల చినబిక్షం, ఎడవల్లి అనుపమ, అన్నపూర్ణ పాల్గొన్నారు.

కేటీఆర్ ఇరవై యూట్యూబ్ ఛానల్స్​తో బద్నాం చేయాలని చూస్తుండు

దేవరకొండ :  మాజీ మంత్రి కేటీఆర్ పదుల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్​ పెట్టించి సర్కారును, తీన్మార్ మల్లన్నను బద్నాం చేయాలని చూస్తున్నాడని ఎమ్మెల్యే బాలునాయక్, గుత్తా అమిత్ రెడ్డి ఆరోపించారు. 
దేవరకొండ పీపీఆర్ కన్వెన్షన్ హాల్​లో నిర్వహించిన సమావేశంలో మల్లన్నతో పాటు ఎమ్మెల్యే బాలునాయక్​, గుత్తా అమిత్​ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేటీఆర్ ఇరవై యూట్యూబ్ ఛానల్స్​ పెట్టించి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఆ అబద్దాలను జనాలు నమ్మే స్థితిలో లేరన్నారు. తీన్మార్​ మల్లన్న మాట్లాడుతూ తనను గెలిపిస్తే తన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు వృథా కానివ్వనని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, ఎంపీపీలు నల్లగాస్ జానియాదవ్, దూదిపాల రేఖ, వంగాల ప్రతాపరెడ్డి, పీఏసీఎస్​చైర్మన్లు దూదిపాల వేణుధర్ రెడ్డి, జాల నరసింహారెడ్డి పాల్గొన్నారు.