ఖానాపూర్​ను రెవెన్యూ డివిజన్​గా మార్చాలి : జాన్సన్ నాయక్

  • పట్టణంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి
  • ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్​ను కోరిన బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయడంతోపాటు పట్టణంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ సీఎం కేసీఆర్​ను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేయగా సీఎం కేసీఆర్​హాజరయ్యారు. ఈ సందర్భంగా జాన్సన్ ​నాయక్​మాట్లాడుతూ.. సదర్ మాట్ ఆనకట్ట పరిధిలోని రైతులకు రెండు పంటలకు సరిపడేలా నీరు ఇచ్చేందుకు మమాడ మండలం వద్ద ప్రాజెక్ట్ నుంచి పాత ఆనకట్ట వరకు స్పెషల్ కెనాల్ ను నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. 

జన్నారంలో జరిగిన సభలో ఖానాపూర్ నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటానన్న విషయాన్న గుర్తుచేస్తూ.. ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అధిక నిధులు కేటాయిస్తే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆంక్షలను తొలగించి ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలని, ఎన్నికలు కాగానే ఖానాపూర్ ప్రాంత సమస్యలు తీరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 30నజరగ నున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కేసీఆర్ సభకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. 

సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల చారి, ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు రవీందర్ రావ్, అదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ రాజేందర్, జడ్పీటీసీలు జానుబాయ్, చారులత, వెంకాగౌడ్, నాయకులు రాము నాయక్, ఖలీల్, పరిమి సురేశ్, రాజా గంగన్న, అనిస్ ఖాన్, గంగారావ్, సాగి లక్ష్మణ్ రావ్, మురళి, మొహిద్, ఇర్ఫాన్, ప్రదీప్, చరణ్, నజీర్, మెహరాజ్, వీరేశ్ తదితరులు ఉన్నారు.