ఖానాపూర్, వెలుగు : ఉట్నూర్ లో జరిగిన కాంగ్రెస్ విజయ భేరి సభలో ఎమ్మెల్యే రేఖా నాయక్ సీఎం కేసీఆర్ పై అనుచితంగా మాట్లాడడం సిగ్గుచేటని.. తక్షణమే ఆమె సీఎంకు క్షమాపణలు చెప్పాలని ఖానాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజా గంగన్న, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, పెంబి జడ్పీటీసీ జానుబాయ్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భిక్షతో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా నాయక్‌కు.. ఈసారి టికెట్దక్కకపోవడంతో అక్కసుతో అనేక సందర్భాల్లో ఆమె కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వందల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. మరోసారి బీఆర్ఎస్ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నాయకులు ఖలీల్, ఇర్ఫాన్, ప్రదీప్, కిషోర్, శ్రీనివాస్, మెహరాజ్, ప్రశాంత్ రెడ్డి, వీరేశ్ తదితరులు ఉన్నారు.