బీఆర్ఎస్​తోనే అన్ని వర్గాలకు న్యాయం : జాన్సన్ నాయక్

ఖానాపూర్/కడెం, వెలుగు :  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాల అమలు చేస్తోందని, అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని ఆ పార్టీ ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండలం బాదనకుర్తి, మేడంపల్లి, సుర్జాపూర్, మస్కాపూర్ గ్రామాలతో పాటు పట్టణంలోని ఆయా వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని వారి  రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని అన్నారు.

కాంగ్రెస్​కు ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో తనను గెలిస్తే సీఎం కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి వందల కోట్ల నిధులు విడుదల చేయడం ఖాయమన్నారు. తనకు ఒక్క అవకాశమిస్తే ఈ ప్రాంత రూపురేఖలను మారుస్తానని పేర్కొన్నారు. ఖానాపూర్, కడెం రైతన్నల సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందని, వారి సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.

మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో పట్టణంతో పాటు పలు మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజేందర్, ఖలీల్, జడ్పీటీసీ ఆకుల వెంకగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నల్లా శ్రీనివాస్, నాయకులు పరిమి సురేశ్, రాజ గంగన్న, రాము నాయక్,  కిషోర్, శ్రావణ్, నరేందర్, ఇర్ఫాన్, గజేందర్, రాజారెడ్డి, నసీర్, ప్రదీప్, మేహరాజ్, షోయబ్, మహేశ్, గంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కడెం మండలం లింగాపూర్​లో జాన్సన్ నాయక్ ఇంటింటి ప్రచారం నిర్వహించగా స్థానిక మహిళలు, పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జాన్సన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీఆర్ఎస్​తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కడెం జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ ఆకుల లచ్చన్న, నాయకులు రంజిత్, నాగేశ్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.