
- ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ కూడా
- ఆర్మూర్ సభలో రాహుల్ సమక్షంలో చేరికకు రంగం సిద్ధం
ఖానాపూర్/ బైంసా, వెలుగు: ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం ఆర్మూర్ లో జరిగే సభలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. రేఖతో పాటు ముథోల్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు పటేల్ కూడా ఇదే వేదికపై కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిద్దరి చేరికకు సంబంధించి కాంగ్రెస్ హై కమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ ను రేఖా నాయక్ కు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకరించడంతోనే ఆమె హస్తం పార్టీలో చేరుతోందని తెలుస్తోంది. దీంతో ఆమె అనుచరులు భారీ సంఖ్యలో ఆర్మూర్ సభకు వెళ్లనున్నారు. ముథోల్ కాంగ్రెస్ టికెట్ ను కూడా నారాయణరావు పటేల్ కు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఖానాపూర్ కాంగ్రెస్ టికెట్ కోసం ఇప్పటికే15 మందికి పైగా ఆశావహులు ఎదురుచూస్తుండగా.. ముథోల్ సెగ్మెంట్ నుంచి టికెట్ పై పూర్తి నమ్మకంతో ఉన్న డా. కిరణ్ కొమ్రేవార్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మొదటి జాబితాలోనే ఈయనకు చోటు దక్కవచ్చని అందరూ భావించారు.
కానీ టికెట్ విషయంలో పార్టీ పునరాలోచన జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగానే నారాయణరావు పటేల్ కు ఈసారి టికెట్ దక్కవచ్చని చర్చ జరుగుతోంది.