
ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో టీ హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశానికి హాజరై మాట్లాడారు. ఖానాపూర్ లో టీహబ్ ఏర్పాటైతే నియోజకవర్గంలోని ఖానాపూర్, కడెం ఉమ్మడి మండలాల ప్రజలకు 54 రకల రక్త పరీక్షలు అందుబాటులో వస్తాయన్నారు. వారంరోజుల్లో ఆస్పత్రిలో కొత్త టెక్నాలజీతో కూడిన ఎక్స్రే మెషీన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ఆర్థోపెడిక్, అనస్తీషియా డాక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ఓపీ, ఐపీ వార్డులతో పాటు డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్యే పరిశీలించి రోగులతో మాట్లాడారు. రోగులతో డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది స్నేహపూర్వకంగా మెలిగి వారికి నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వంశీ మాధవ్, తహసీల్దార్ సుజాత రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, సివిల్ సర్జన్ డాక్టర్ స్వర్ణారెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు భూషణ్, అబ్దుల్ మాజిద్, మున్సిపల్ మాజీ చైర్మన్లు రాజురా సత్యం, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.