జన్నారం, వెలుగు: ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేదింటి ఆడబిడ్డ అత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. మంగళవారం జన్నారం మండలంలోని ఇందన్ పెల్లి, దేవునిగూడ, కామన్ పెల్లి, రేండ్లగూడ గ్రామ సమీపంలోని ఉపాధి కూలీల వద్దకు వెళ్లి మాట్లాడారు.
దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తామన్నారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. దేవుడి పేరు చెప్పి ఓట్లడుగుతున్న బీజేపీని నమ్మొద్దని కోరారు. సాయంత్రం మండల కేంద్రంలోని వార సంతలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ ముజాఫర్ ఆలీఖాన్, సీనియర్ నాయకులు రాజశేఖర్, సయ్యద్ ఇసాక్, మాణిక్యం, సయ్యద్ ఫసిఉల్లా, రియాజ్, ఇందయ్య, ముత్యం రాజన్న, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.