ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ఇప్పపువ్వు పండుగ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ఇప్పపువ్వు పండుగ : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్​(ఉట్నూర్), వెలుగు: ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల్లో ఇప్పపువ్వుకు ప్రత్యేక స్థానం ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఉట్నూరు మండల కేంద్రం కేబీ కాంప్లెక్స్ లోని పీఎంఆర్సీ భవనంలో నిర్వహించిన ఇప్పపువ్వు పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఇప్పపువ్వుతో తయారు చేసిన లడ్డు, జొన్న గట్కా, మక్క గట్క, గారెలు, పలు రకాల వంటకాల స్టాల్ ను పరిశీలించారు. అనంతరం ఇప్పపువ్వుకు పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీలకు ఇప్పపువ్వుతో విడదీయని అనుబంధం ఉందన్నారు. ఇప్పపువ్వుతో అనేక లాభాలున్నాయని, రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇప్పపువ్వు లడ్డూతో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందని తెలిపారు. నాడు కలెక్టర్ గా పనిచేసిన దివ్య దేవరాజన్ ఈ పండుగను ప్రారంభించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీ బాయి, జిల్లా సార్మేడి దుర్గపటేల్, ఏపీవో మెస్రం మనోహర్, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

సేంద్రియ ఎరువులు ఆరోగ్యానికి శ్రేయస్కరం 

సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంటలను తినడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని బొజ్జు పటేల్ అన్నారు. హార్టికల్చర్, సీఫీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మామిడి పండ్ల దుకాణాన్ని ప్రారంభించారు. రైతులు తమ పొలాల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడకంపై దృష్టి పెట్టాలని సూచించారు. రసాయన ఎరువులు వాడకం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. 

ఏజెన్సీ ప్రాంత రైతులు స్వశక్తితో ఎదగడానికి ప్రభుత్వాలు చేయూతనందిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్, సీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆర్టీఏ జిల్లా కమిటీ మెంబర్ దూట రాజేశ్వర్ 
పాల్గొన్నారు.