
ఖానాపూర్, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టం 2024ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఖానాపూర్ పట్టణానికి చెందిన పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు వక్ఫ్ సవరణ చట్టం రద్దును కోరుతూ శుక్రవారం పలు మసీదుల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
వక్ఫ్ సవరణల పేరుతో ముస్లింల ఆస్తులను కబళించే దుర్మార్గపు చర్యలకు మోడీ సర్కార్ తెరలేపిందన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్ర మాల్లో జామా మసీదు అధ్యక్షుడు జహీర్ హైమద్, మౌలానా అతిక్ , మౌలానా ఖాదర్, మౌలానా రైస్, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు చాంద్ పాషా, నాయకులు, ఆయా మసీదుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగానికి వ్యతిరేకంగా..
కోల్ బెల్ట్: మందమర్రి రెండో జోన్ మదీనా మసీదులో జుమ్మా నమాజ్ అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వక్ఫ్‌బోర్డు ఆస్తులను తన ఆధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో పార్లమెంటులో బిల్లు ప్రతిపాదన చేస్తోందన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గోదావరిఖనికి చెందిన జమాతే ఇస్లాం హింద్ వైస్ ప్రెసిడెంట్ఎండీ ఇస్మాయిల్, మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో..
కాగజ్ నగర్: వక్ఫ్ సవరణ బిల్లు 2024కు వ్యతిరేకంగా కాగజ్ నగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జమాతే ఇస్లామీ హింద్ పట్టణ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ బషీరుద్దీన్, మైనార్టీ నేత జాకీర్ షరీఫ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ ఆస్తులను ప్రభుత్వ ఆధీనం తీసుకునేందుకు కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.