Jemimah Rodrigues: తండ్రి మతపరమైన కార్యకలాపాలు.. భారత క్రికెటర్ సభ్యత్వం రద్దు

 Jemimah Rodrigues: తండ్రి మతపరమైన కార్యకలాపాలు.. భారత క్రికెటర్ సభ్యత్వం రద్దు

టీమిండియా మహిళా క్రికెటర్  జెమిమా రోడ్రిగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని పురాతన క్లబ్‌లలో ఒకటైన ఖార్ జింఖానా
జెమిమా రోడ్రిగ్స్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ”జింఖానాలో ఆమె తండ్రి కొంతమంది వ్యక్తులతో కలిసి మతపరమైన కార్యకలాపాలు చేస్తూ పట్టుబడినందున ఈ చర్య తీసుకున్నట్లు ఖార్ జింఖానా కమిటీ తెలిపింది. బలవంతంగా మతం మార్చేందుకు ఆమె తండ్రి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

ఆదివారం (అక్టోబర్ 20) జరిగిన సాధారణ సమావేశానికి హాజరైన సభ్యులు ఆమోదించిన తీర్మానం ప్రకారం రోడ్రిగ్స్‌కు మూడేళ్ల సభ్యత్వం రద్దు చేయబడిందని ఖార్ జింఖానా అధ్యక్షుడు వివేక్ దేవ్నానీ అన్నారు. జెమీమాకు ఫోన్ కాల్స్ ద్వారా మొత్తం సమాచారం అందించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఆమె తండ్రి మాత్రం ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.

ALSO READ | Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్‌‌లో భారీ మార్పులు.. హాకీ, క్రికెట్ సహా పలు గేములు తొలగింపు

ఖర్ జింఖానా మేనేజింగ్ కమిటీ సభ్యుడు శివ్ మల్హోత్రా కారణాలను వివరించారు.“జెమిమా రోడ్రిగ్స్ తండ్రి బ్రదర్ మాన్యుయెల్ మినిస్ట్రీస్ అనే సంస్థకు అనుబంధంగా ఉన్నారని మాకు తెలిసింది. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రెసిడెన్షియల్ హాల్ బుక్ చేసుకుని 35 ఈవెంట్లు నిర్వహించారు. అక్కడ ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు'' అని అన్నారు. రాజ్యాంగంలోని ఖార్ జింఖానా చట్టాల రూల్ 4A ప్రకారం, ఖార్ జింఖానా ఎటువంటి మతపరమైన కార్యకలాపాలను అనుమతించదు".అని మల్హోత్రా చెప్పారు.

జెమిమా రోడ్రిగ్స్ భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక ప్లేయర్. 2018 లో టీమిండియాలోకి అరంగేట్రం చేసి అత్యంత నిలకడగా రాణిస్తుంది.  ఇప్పటి వరకు 3 టెస్టుల్లో 58.75 సగటుతో 235 పరుగులు.. 30 వన్డేల్లో 5 అర్ధ సెంచరీల సాయంతో 710 పరుగులు చేసింది. టీ20 విషయానికి వస్తే 104 మ్యాచ్‌లలో 29.75 సగటు, 114.17 స్ట్రైక్ రేట్‌తో 2142 పరుగులు చేసింది. ఆమె ఖాతాలో 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి