జనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్​

జనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్​చేశారు. జనగణన ఆలస్యం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని అన్నారు. మంగళవారం (April 1) రాజ్యసభ జీరో అవర్ లో ఆయన మాట్లాడుతూ.. 1881 నుంచి భారతదేశం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 

యుద్ధాలు, అత్యవసర పరిస్థితులు, ఇతర సంక్షోభాల సమయంలో కూడా దీనిని నిర్వహించారని తెలిపారు. 1931లో జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించినట్టు గుర్తుచేశారు. ‘‘మన ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి వైద్య పరీక్షలు ఎంత అవసరమో.. ఒక దేశానికి జనగణన అనేది కూడా అంతే ముఖ్యమైది” అని మహాత్మా గాంధీ పేర్కొన్నారని ఖర్గే తెలిపారు. జనాభా గణన అనేది ఒక కీలకమైన ప్రక్రియ అని, దీంతో ఉపాధి, సామాజిక -ఆర్థిక పరిస్థితులు, ఇతర కీలక అంశాలపై కూడా డేటా లభిస్తుందన్నారు.