న్యూఢిల్లీ: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు లోక్ సభ ఎన్నికల్లో ‘ఈసారి 400కుపైగా సీట్లు’ అని ప్రచారం చేసుకున్నదని.. కానీ సొంతంగా మెజార్టీ కూడా సాధించలేకపోయిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు.
మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ రెండు సపోర్టింగ్ లెగ్స్ మాదిరిగా ఉన్నారని కామెంట్ చేశారు. ‘‘మోదీ ఈ రెండు కాళ్లపై నిలబడి ఉన్నారు. ఎవరైనా ఇలా కొంచెం తోసేస్తే చాలు.. పడిపోతారు.
ఆయన సర్కారు కుప్పకూలుతుంది” అని ఎద్దేవా చేశారు. సోమవారం మధ్యప్రదేశ్ లోని మహూ(అంబేద్కర్ పుట్టిన టౌన్)లో జరిగిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో ఖర్గే మాట్లాడారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు ద్రోహులు అని ఫైర్ అయ్యారు.
వారు మాటలతో ప్రజలను రెచ్చగొట్టి, అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారని, రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను లాగేసుకుంటారని విమర్శించారు. ప్రజలంతా ఒక్కటైతేనే వారి నుంచి దేశాన్ని కాపాడుకోవచ్చన్నారు.
అంబేద్కర్, నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బాటలో నడిచి మతతత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. గంగా నదిలో మునిగితే పేదరికం తొలగిపోదని ఖర్గే అన్నారు. అమిత్ మహా కుంభమేళా పర్యటన పబ్లిసిటీ కోసమే అని మండిపడ్డారు.