కర్నాటక CM సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

కర్నాటక CM  సిద్ధరామయ్య రాజీనామాపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

బెంగుళూరు: కన్నడ రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కాక రేపుతోంది. తన సతీమణికి సీఎం సిద్ధరామయ్య అక్రమంగా విలువైన భూములు కట్టబెట్టారంటూ వెల్లువెత్తిన ఆరోపణలపై గవర్నర్ విచారణకు ఆదేశించడం.. దీనిని సిద్ధరామయ్య కోర్టులో సవాల్ చేయడం.. న్యాయస్థానం సీఎం అభ్యర్థనను తోసి పుచ్చడంతో కర్నాటక పాలిటిక్స్ హీటెక్కాయి.

ఇప్పటికే సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేయగా.. త్వరలోనే సీఎంను విచారించనున్నారు. ముడా స్కామ్‎లో సిద్ధరామయ్యపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. అవినీతికి పాల్పడిన సిద్ధరామయ్య కర్నాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ముడా స్కామ్, సీఎం సిద్ధరామయ్య రాజీనామా అంశంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | రాహుల్ గాంధీ ధైర్యవంతుడు.. నిజాయితీ పరుడు : సైఫ్ అలీఖాన్

ఇవాళ (సెప్టెంబర్ 27) ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా ముడా స్కామ్‎లో సీఎం సిద్ధరామయ్య పాత్ర లేనేలేదని ఆరోపణలను కొట్టిపారేశారు. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు, అసత్య ఆరోపణలు చేయడం బీజేపీకి అలవాటేనని దుయ్యబట్టారు. ముడా స్కామ్‎పై విచారణ జరుగుతోందని.. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు