ఖమ్మం జిల్లాలో జోరందుకున్న ఖరీఫ్​ సాగు!

ఖమ్మం జిల్లాలో  జోరందుకున్న ఖరీఫ్​ సాగు!
  • వర్షాలతో వ్యవసాయ పనుల్లో రైతులు బిజీ 
  • ఉమ్మడి జిల్లాలో పత్తి, వరి సాగే అధికం  
  • పప్పులు, తృణధాన్యాల సాగు అంతంతే..

ఖమ్మం, వెలుగు: ఖరీఫ్​ సీజన్​లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గత నెలలో సరిగా వర్షాలు కురవకపోవడంతో టెన్షన్​ పడ్డ రైతులకు రెండు వారాల నుంచి పడుతున్న వానలు హుషారునిచ్చాయి. ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం 245.3 మిల్లీమీటర్లకుగాను 43 శాతం అధికంగా 350.8 మిల్లీమీటర్ల  వర్షం కురిసింది. 21 మండలాలకు గాను 18 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. కామేపల్లిలో సాధారణ వర్షం నమోదు కాగా, కేవలం ఎర్రుపాలెం, సింగరేణి (కారేపల్లి) మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ వర్షపాతం 297.9 మిల్లీమీటర్లకు గాను, 38.4 శాతం అధికంగా 412.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 23 మండలాలకు గాను 17 మండలాల్లో అధిక వర్షపాతం, 6 మండలాల్లో సాధారణ వర్షం పడింది.

 వాణిజ్య పంటలకే మొగ్గు..

  • ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు అత్యధిక ఎకరాల్లో పత్తి విత్తనాలు వేసుకోగా, వరి సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోంది. ఇక మిర్చి సాగుకు కూడా రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాలో సారవంతమైన భూములు ఉండడంతో రైతులు వాణిజ్య పంటలకే మొగ్గుచూపుతున్నారు. ఖమ్మం జిల్లాలో 5,96,662 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనాలు ఉండగా, ఇప్పటి వరకు 2,76,313 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది 2,01,834 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని ఆఫీసర్లు అంచనా వేయగా, ఇప్పటి వరకు 1,82,875 ఎకరాల్లో పత్తి గింజలు నాటుకున్నారు. 2,83,943 ఎకరాల్లో వరి సాగు ఉంటుందని అంచనాలు ఉండగా, ఇప్పటి వరకు 43,410 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఇందులో 25,174 ఎకరాల్లో నేరుగా విత్తే పద్ధతిలో వరి సాగు చేయగా, 18,236 ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేసుకున్నారు. ఇంకా 66,626 ఎకరాల్లో వరి నారు పెంచుతున్నారు. పెసలు 12,824 ఎకరాల్లో, మొక్కజొన్న 1,425 ఎకరాల్లో, చెరకు 41 ఎకరాల్లో, వేరుశనగ 42 ఎకరాల్లో, మినుములు 63ఎకరాల్లో, కందులు 131 ఎకరాల్లో, జీలుగు 31184, పిల్లిపెసర 460, జనుములు 2708 ఎకరాల్లో సాగు చేశారు. 
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతేడాది 5,49,190 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 3,94,591 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అత్యధికంగా పత్తి 1,88,263, మొక్కజొన్న 41,025, జీలుగు 28,327 ఎకరాల్లో, వరి 11,033, కందులు 604, పెసలు 46, చెరుకు 42, జనుములు 4,705 ఎకరాల్లో సాగు చేశారు. 64,436 ఎకరాల్లో ఆయిల్ పామ్, 56,104 ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ​అయితే ఉమ్మడి జిల్లాలో ఇతర తృణధాన్యాల సాగు పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవంటూ రైతులు సాగుకు మొగ్గుచూపడం లేదు. జిల్లాలో సారవంతమైన భూములు ఉండడంతో లాభసాటిగా ఉండే వాణిజ్యపంటల సాగుకే రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.