హైదరాబాద్ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్

  • 2026లో నిర్వహించేందుకు కేంద్రం సుముఖం

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026 పోటీలను హైదరాబాద్‌‌‌‌లో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌‌‌‌రెడ్డికి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్ సింగ్ మాండవీయ హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, చామల, రామసహాయంలతో కలిసి కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయను జితేందర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించాలని సీఎం రాసిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు.

హైదరాబాద్ లో 32వ నేషనల్ స్పోర్ట్స్ (2002లో), ఆఫ్రో ఆషియన్ గేమ్స్, 7వ మిలిటరీ గేమ్స్ సహా అనేక జాతీయ స్థాయి పోటీలు జరిగాయని సీఎం తన లేఖలో ప్రస్తావించారు.గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎల్బీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం, కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, హుస్సేన్ సాగర్‌‌‌‌లో వాటర్ స్పోర్ట్స్, ఉస్మానియా క్యాంపస్‌‌‌‌లో సైక్లింగ్ వెల్‌‌‌‌డ్రోమ్, జింఖానా-2 గ్రౌండ్‌‌‌‌లో ఫుట్ బాల్ గ్రౌండ్‌‌‌‌తో పాటు ఔట్ డోర్ గేమ్స్ నిర్వహించే వసతులు ఉన్నాయని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా యువతను ప్రోత్సహించేలా ప్రత్యేక పాలసీని రూపొందిస్తుందని తెలిపారు. ఈ విజ్ఞప్తి పై కేంద్ర మంత్రి తక్షణమే సానుకూలంగా స్పందించినట్లు జితేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఇకపై క్రీడా పోటీల నిర్వహణతో పాటు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అవగాహనతో ఉందని ఆయన పేర్కొన్నారు.

నేషనల్ గేమ్స్ హైదరాబాద్​లో పెట్టండి

భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు అనిల్ కుమార్, రామ సహాయం, కడియం కావ్య గురువారం కలిశారు. నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో నిర్వహించాలని ఆమెను విజ్ఞప్తి చేశారు.