రెంట్​కు పెట్టిన వెహికల్స్ ను కుదువ పెట్టేసింది!

రెంట్​కు పెట్టిన వెహికల్స్ ను కుదువ పెట్టేసింది!

ఎక్కువ రెంట్ కు ఆశపడడంతో అసలుకే మోసం

ఓనర్లను నిండా ముంచిన కిలాడీ లేడీ
పోలీసులకు కంప్లైంట్  చేసిన ఓనర్లు

గద్వాల, వెలుగు: ఎక్కువ కిరాయికి వెహికల్స్ ను రెంట్ కి పెట్టుకుంటామని ఆశ చూపి వాటిని వేరే రాష్ట్రాల్లో ఇతరులకు కుదువ పెట్టి మోసం చేసిన కిలాడి లేడీ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ చేతిలో జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి, మానవపాడు, అలంపూర్​ మండలాలకు చెందిన 15 మంది ఫోర్  వీలర్స్ ఓనర్లు మోసపోయారు. హైదరాబాద్​లోని టెలికాం నగర్ కు చెందిన ఉష రియల్టర్లకు, ఐటీ కంపెనీలకు, ఎయిర్  పోర్ట్  పనులకు వెహికల్స్  కిరాయి కావాలని నమ్మించి వాటిని కిరాయి పెట్టాక ఇతర రాష్ట్రాల వారికి కుదువపెట్టి మోసం చేసింది.

రోజుకు 2,500 కిరాయి పేరుతో..

తన దగ్గర వెహికల్  రెంట్​కు పెడితే రోజుకు రూ.2,500 కిరాయి ఇస్తానని నమ్మబలికింది. కిరాయి బాగానే వస్తుందని చెప్పి గద్వాల జిల్లాలోని పలు మండలాలకు చెందిన 15 వెహికల్స్  ఓనర్లు ఆమెకు అద్దెకు ఇచ్చారు. ముందుగా వెహికల్స్ కు సంబంధించిన ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకొని అడ్వాన్స్ గా ఒక్కో వెహికల్ కు రూ. 10 వేల నుంచి రూ.40 వేల వరకు ఇచ్చింది. ఆ తర్వాత ప్రతి నెలా డబ్బులు ఇస్తానంటూ అగ్రిమెంట్  చేసుకుంటుంది. ఒకసారి ఆమె చేతిలోకి వెహికల్  పోయిందంటే ఇక అంతే సంగతులు. అడ్వాన్స్ తోనే మురిసిపోవాల్సిందే. కిరాయి మాట దేవుడెరుగు ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తూ రోజులు, నెలలు, ఏండ్లు గడిపేసిందని బాధితులు వాపోతున్నారు.

జీపీఎస్, టోల్  గేట్ల ద్వారా గుర్తింపు..

గద్వాల జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఆమెకు  వెహికల్స్  కిరాయికి ఇచ్చినట్లు తెలుస్తోంది. నెలనెలా కిరాయి ఇవ్వకపోవడం, తమ వెహికల్స్  కర్నాటక, మహారాష్ట్రలో తిరుగుతున్నట్లు టోల్ గేట్లు, వెహికల్ కు ఉన్న జీపీఎస్  ద్వారా ఓనర్లు గుర్తించారు. ఈ విషయంపై ఆమెను నిలదీస్తే పని మీద అక్కడికి వెళ్లారని, వచ్చిన వెంటనే కిరాయి ఇస్తానంటూ బుకాయిస్తూ వచ్చింది. కొందరికి కిరాయి వేద్దామంటే మీ కేవైసీ అప్​డేట్  కాలేదని దబాయించేది.

అసలు కథ తెలిసిందిలా..

ప్రతిరోజు అబద్దాలు చెబుతుండడంతో విసుగెత్తిన ఓనర్లు వెహికల్స్ తిరుగుతున్న ప్రాంతాన్ని జీపీఎస్  ద్వారా గుర్తించి అక్కడికి వెళ్లడంతో ఈ వ్యవహారం బయటపడింది. వెహికల్స్ ను తాము రూ.3 లక్షలకు కుదువ పెట్టుకున్నామని, వెహికల్ పై చెయ్యి వేస్తే ఊరుకోమని బెదిరించారని బాధితులు వాపోయారు. ఏమైనా సమస్య ఉంటే వెహికల్ ఎవరికి ఇచ్చారో, వారితో మాట్లాడుకోండని దౌర్జన్యం చేశారని బాధితులు పేర్కొన్నారు. ఇలా ఒక్కో వెహికల్ ను రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షలకు కుదువ పెట్టి పెద్ద ఎత్తున డబ్బు సొమ్ము చేసుకుంది. మహిళ చేతులు మోసపోయామని గ్రహించి ఓనర్లు మంగళవారం రాయదుర్గం పీఎస్ లో కంప్లైంట్  చేశారు. ప్రస్తుతం జిల్లాకు చెందిన రెండు వెహికల్స్ ను ట్రేస్  చేశారని, మిగిలిన వెహికల్స్ ను పోలీసులు ట్రేస్  చేసే పనిలో ఉన్నారని బాధితులు తెలిపారు. ఎవరూ ఇలా మోసపోవద్దని బాధితులు కోరారు.

రెండు నెలల కింద పెట్టాను..

తన వెహికల్  రెండు నెలల కింద మహిళ దగ్గర కిరాయికి పెట్టాను. రూ.10 వేల అడ్వాన్స్  ఇచ్చి, కిరాయి అడిగితే ఇప్పుడు అప్పుడు అంటూ దాటవేసింది. నా వెహికల్ ను బీదర్ కు చెందిన ఒక వ్యక్తి దగ్గర కుదవపెట్టినట్టు తేలింది.- ఏడుకొండల నాయుడు, అలంపూర్