నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండ లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్‌గా ఖుష్బూ గుప్తా గురువారం చార్జ్ తీసుకున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు ఏవో మోతీలాల్ పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన ఆఫీస్‌లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సిబ్బంది కంగ్రాట్స్ చెప్పారు.
ఎంజీయూ బాస్కెట్‌బాల్ టీం సెలక్షన్స్
నల్గొండ అర్బన్, వెలుగు : ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంజీయూ టీం ఎంపిక కోసం గురువారం యూనివర్సిటీలో పోటీలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలను ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ చొల్లేటి గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లు చదువుతో పాటు ఆటలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపిక పోటీల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 మెన్స్, 7 ఉమెన్స్ టీంలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తుమ్మ కృష్ణారావు, స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, పీడీలు మురళి, శ్రీనివాస్‌రెడ్డి, వై.ప్రశాంతి, రమణారెడ్డి, మల్లేశ్ పాల్గొన్నారు.
బలహీన వర్గాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ కృషి
హుజూర్‌నగర్/మేళ్లచెరువు, వెలుగు : బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చెప్పారు. నియోజకవర్గానికి చెందిన 326 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా కేంద్రం ఈడీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు. అంతకుముందు ఏరియా హాస్పిటల్‌లో సేవ్ ది చిల్డ్రన్ ఫౌండేషన్ అందజేసిన అంబులెన్స్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ కరుణ్‌కుమార్, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మున్సిపల్ వైస్‌చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ జయబాబు పాల్గొన్నారు. అలాగే కొంకపాక కస్తూరి జ్ఞాపకార్థం మేళ్లచెరువులో నిర్మించిన అన్నదాన సత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
నారసింహుడి సేవలో హీరో నాని
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని గురువారం హీరో నాని దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అద్దాల మండపం వద్ద వేదాశీర్వచనం చేయగా, ఆలయ ఆఫీసర్లు స్వామివారి ప్రసాదం, శేషవస్త్రాలు అందజేశారు. ఆయన వెంట ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఉన్నారు. మరోవైపు ఆలయంలో నారసింహుడికి నిత్య పూజలు, సత్యనారాయణ వ్రతాలు, శివకేశవులకు కార్తీక పూజలు వైభవంగా జరిగాయి. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా గురువారం ఆలయానికి రూ.22,70,280 ఇన్‌కం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు.
కేంద్ర పథకాలు ప్రజలకు చేరేలా చూడాలి
కోదాడ, వెలుగు : కేంద్రం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకాలు ప్రజలకు చేరేలా హెల్త్ ఆఫీసర్లు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ అద్వైత్‌సింగ్ కుమార్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాల అమలు తీరును పరిశీలించేందుకు గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు పీహెచ్‌సీ, కూచిపూడి హెల్త్ వెల్‌నెస్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా గర్భిణుల నమోదు, రక్తహీనత, మధుమేహం, బ్లడ్‌ప్రెజర్, క్యాన్సర్ కేసులు, టెలీ కన్సల్టేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కోట చలం, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ నిరంజన్, కమ్యూనల్ డిసీజస్ జిల్లా ఆఫీసర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్లు వెంకటరమణ, జయ, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రిలీజ్
సూర్యాపేట, వెలుగు : డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌ను రాజకీయ పార్టీలకు అందజేసినట్లు సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఓటర్లంతా తమ పేర్లను చెక్ చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే ఫారం 6, 7, 8 ద్వారా సంబంధిత ఆఫీసర్లకు ఈ నెల 10 నుంచి వచ్చే నెల 8 లోపు అందజేయాలని సూచించారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 10, 11 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను జనవరి 5న ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఎస్.మోహన్‌రావు, సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్ పద్మారావు, డీటీ వేణు పాల్గొన్నారు.
యాదాద్రిలో పురుష ఓటర్లే ఎక్కువ
యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ లిస్ట్‌తో పోల్చుకుంటే ఈ సారి 1,036 మంది పెరిగారు. భువనగిరి నియోజకవర్గంలో 75 మంది ఓటర్లు తగ్గగా, ఆలేరు నియోజకవర్గంలో 1,111 మంది పెరిగారు. రెండు నియోజవకర్గాల్లో కలిపి ప్రస్తుతం 4,18,076 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,07,988 మంది ఉండగా, పురుషులు 2,10,078 మంది ఉన్నారు. మహిళల కంటే పురుష ఓటర్లు 2.090 మంది ఎక్కువగా ఉన్నారు. భువనగిరి నియోజకవర్గంలో 1,01,134 మంది పురుషులు, 1,00,299 మంది స్త్రీలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 1,08,944 మంది పురుషులు, 1,07,689 మంది స్త్రీలు, 9 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. కాగా వచ్చే నెల 11 వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే లక్ష్యం
నల్గొండ అర్బన్, వెలుగు : ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే న్యాయసేవాధికార సంస్థ లక్ష్యమని అరోరా లీగల్ సైన్స్ ఇన్స్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ నక్క యాదగిరి చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ, ఆరోరా లీగల్ సైన్స్ ఇన్స్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో గురువారం మర్రిగూడలో నిర్వహించిన న్యాయ సహాయ సదస్సులో ఆయన మాట్లాడారు. వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపు ఉన్న వారందరికీ న్యాయసాయం కోసం అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.
కాలేజీ స్టూడెంట్లు, టీచర్లు ఇంటింటికీ తిరుగుతూ ఉచిత న్యాయ సేవ కార్యక్రమాల పాంప్లెంట్స్‌ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తండు శ్రీనివాస్‌గౌడ్, ధనలక్ష్మి, వెంకటేశ్‌గౌడ్, మహ్మద్ మెహబూబ్‌పాషా పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
కోదాడ /మునగాల వెలుగు : కోదాడ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలు వార్డులు, మండల పరిధిలోని గుదిబండలో పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. అనంతరం కూచిపూడిలో మాజీ సర్పంచ్ శెట్టి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో కోదాడ ఎంపీపీ చింతా కవిత, కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు కల్లూరి పద్మజ, బట్టినేని హనుమంతరావు పాల్గొన్నారు. అనంతరం మోతె మండలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం
దేవరకొండ, వెలుగు : రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో గురువారం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు క్వాలిటీ వడ్లు తీసుకొచ్చి మద్ధతు ధర పొందాలని సూచించారు. అనంతరం కొండభీమనపల్లిలో క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, జడ్పీటీసీ మారుపాకుల అరుణసురేశ్, పీఏసీఎస్ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు మునుకుంట్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి
నకిరేకల్ (కేతేపల్లి), వెలుగు : కేతేపల్లి మండలం బొప్పారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌ను గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లను అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం కేతేపల్లి మండలం చీకటిగూడెంలో పార్మేషన్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
12న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలి
యాదాద్రి, వెలుగు : తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ ఈ నెల 12న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ గత సంవత్సరమే పునఃప్రారంభమై 10 లక్షల టన్నుల ఎరువులను ఉత్పత్తి చేసిందన్నారు. ఆ ఫ్యాక్టరీని ఇప్పుడు మళ్లీ ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకొని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు.
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
మునుగోడు, వెలుగు : కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మునుగోడులో గురువారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను బీజేపీ ప్రభుత్వం మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ పోరాటాలు చేస్తోందన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను, బెల్లం శివయ్య, ఈద యాదయ్య, దాము ఖాసీం, పి.భిక్షం, యాదయ్య, ముత్తయ్య, రాములు, వెంకన్న, స్వామి పాల్గొన్నారు.
‘గొల్లకురుమలను కేసీఆర్ మోసం చేసిండు’
యాదగిరిగుట్ట, వెలుగు : గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా గొల్లకురుములకు నగదు బదిలీ చేస్తానని మునుగోడు ఎన్నికల ముందు చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలు అందజేస్తామంటూ నమ్మకద్రోహం చేశాడని పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఎన్నికల్లో గొల్లకురుమల ఓట్ల కోసమే నగదు బదిలీ అంటూ డ్రామాలు ఆడారని విమర్శించారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో గురువారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు ముగిశాక మరో మాట మాట్లాడడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీపై యూటర్న్ తీసుకోవడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ ఆడుతున్న డ్రామాలను గొల్లకురుమలు గమనిస్తున్నారని, 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రాజు, మున్సిపల్ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు కర్రె అజయ్, రాజు ఉన్నారు.
పెండింగ్ ఫీజులను రిలీజ్ చేయాలి
మిర్యాలగూడ/కోదాడ, వెలుగు : పెండింగ్‌లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిర అశోక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రూ. 300 కోట్లు పెండింగ్‌లో ఉండడంతో ఫీజులు కట్టాలని కాలేజీ నిర్వాహకులు స్టూడెంట్లపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల స్టూడెంట్లు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ ఫీజులను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పోలగాని వెంకటేశ్‌గౌడ్, శ్రీను, రాజు, మహేశ్ పాల్గొన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ, నాయకులు పోలంపల్లి సుధాకర్, బేతు నరేశ్, కటారి నరేందర్, జంగిలి వెంకన్న సతీశ్ పాల్గొన్నారు.
స్టూడెంట్స్‌లో స్కిల్స్ పెంచాలి
మేళ్లచెరువు, వెలుగు : స్టూడెంట్స్‌లో రీడింగ్, రైటింగ్ స్కిల్స్ పెంచేలా టీచర్లు బోధన చేయాలని సూర్యాపేట డీఈవో అశోక్ సూచించారు. మేళ్లచెరువు, రేవూరు, హేమ్లాతండాల్లో గురువారం పలు స్కూల్స్‌ను సందర్శించి తొలి మెట్టు, మన ఊరు మన బడి కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. బోధనోపకరణాలను ఉపయోగించుకొని పాఠాలు చెప్పాలని, ఎప్పటికప్పుడు పిల్లల ప్రగతిని అంచనా వేయాలని సూచించారు. అనంతరం చింతలపాలెం కస్తూర్బా స్కూల్‌ను సందర్శించి పిల్లలతో మాట్లాడారు. ఆయన వెంట ఎంఈవో సైదానాయక్, హెచ్‌ఎం నారపరెడ్డి ఉన్నారు.
గొర్రెల కాపరులకు నగదు బదిలీ చేయాలి
తుంగతుర్తి, వెలుగు : గొర్రెలు, మేకల కాపరులకు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షుడు కడెం లింగయ్య యాదవ్ కోరారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో గురువారం నిర్వహించిన గొర్ల కాపరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగదు బదిలీ చేస్తామని మునుగోడు ఎన్నికలకు ముందు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మాట మార్చడం సరైంది కాదన్నారు. డీడీలతో పని లేకుండా నగదు బదిలీని అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వీరబోయిన రాములు, కొమ్మ లింగయ్య, శీను, కొమురయ్య, లింగయ్య, కుమార్ పాల్గొన్నారు.