కన్నడ నటుడు కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ (86) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అంతిమ నివాళులర్పించేందుకు వీలుగా ఆమె పార్థివదేహాన్ని జేపీ నగర్‌లోని వారి నివాసానికి తరలిస్తామని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు విల్సన్ గార్డెన్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విస్తృత ఖ్యాతిని సంపాదించిన కుమారుడు కిచ్చా సుదీప్‌కు ఆమె తల్లి సరోజ మూలస్తంభం. కథలు ఎంచుకోవడంలో కానీ, కుమారుడు తీసుకునే నిర్ణయాల్లో కానీ ఆమెది ప్రధాన పాత్ర. ఈ విషాద ఘటన వారి కుటుంబంలో తీరని లోటును మిగిల్చింది.