బళ్లారి: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో ఒక పిల్లల డాక్టర్ కిడ్నాప్ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. డాక్టర్ను కిడ్నాప్ చేసి 6 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు 24 గంటల్లోనే మనసు మార్చుకున్నారు. కిడ్నాప్ చేసిన డాక్టర్ను వదిలేశారు. ‘‘తెల్లవారుజామున వాకింగ్కు వెళుతుంటే ఎత్తుకొచ్చేశాం కద.. పాపం ఇంటికెళ్లడానికి ఛార్జీలకు డబ్బులున్నాయో, లేవో’’ అని ఆ డాక్టర్ ఇంటికెళ్లడానికి బస్ ఛార్జీలకు 300 రూపాయలను కిడ్నాపర్లే ఆయన చేతిలో పంపించేశారు.
రూ. 6 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు 300 రూపాయలు బస్ ఛార్జీలకు ఇచ్చి మరీ డాక్టర్ను విడిచిపెట్టడంతో నెట్టింట ఈ వార్త వైరల్ అయింది. కిడ్నాపర్లు ఎందుకు ఇలా మనసు మార్చుకున్నారనే చర్చ నెట్టింట నడిచింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. డాక్టర్ సునీల్ అనే పిడియాట్రిషియన్ బళ్లారి జిల్లా హాస్పిటల్లో పిల్లల డాక్టర్గా పనిచేస్తున్నారు.
బళ్లారిలోని సూర్యనారాయణపేట ఏరియాలో డాక్టర్ సునీల్ నివాసం ఉంటున్నారు. రోజూలానే జనవరి 26న వేకువజామున వాకింగ్కు బయల్దేరారు. టాటా ఇండిగో కారులో కిడ్నాపర్లు ఆయనను వెంబడించారు. డాక్టర్ సునీల్ను కొట్టి బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సునీల్ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు ఆయన సోదరుడు వేణుగోపాల్ గుప్తాకు కాల్ చేశారు. ఈ వేణుగోపాల్ గుప్తాకు సమాజంలో మంచి పలుకుబడి ఉంది.
బళ్లారి జిల్లా లిక్కర్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా. ఆయనకు కాల్ చేసిన కిడ్నాపర్లు సునీల్ను విడిచిపెట్టాలంటే రూ.6 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రూ.6 కోట్లలో సగం డబ్బు గోల్డ్ రూపంలో ఉండాలని షరతు పెట్టారు. వేణుగోపాల్ గుప్తా కుటుంబం బళ్లారి జిల్లా ఎస్పీ శోభారాణిని ఆశ్రయించింది. పోలీసులు కిడ్నాపర్లను పట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఆ కారు వెళ్లిన మార్గంలోని సీసీ కెమెరాలన్నింటినీ జల్లెడ పట్టి ఫుటేజ్ సేకరించారు. డాక్టర్ సునీల్ మొబైల్ నెట్వర్క్ ద్వారా కిడ్నాపర్లు ఉన్న లొకేషన్ను కనిపెట్టారు.
బళ్లారిలో అడుగడుగునా పోలీస్ పెట్రోలింగ్ గట్టిగా చేశారు. కిడ్నాపర్లకు ఈ కిడ్నాప్ ఎపిసోడ్ క్లైమ్యాక్స్ ఏంటో అర్థమైపోయింది. దొరికిపోవడం ఖాయమని గుర్తించారు. పోలీసులు తమను విడిచిపెట్టరని అర్థమైపోయి డాక్టర్ సునీల్ ను వదిలేయడం బెటర్ అని ఈ కిడ్నాప్ గ్యాంగ్ నిర్ణయించుకుంది. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో కురుగొడు తాలూకాలోని సోమసముద్ర గ్రామంలో డాక్టర్ సునీల్ ను వదిలేసి వెళ్లిపోయారు.
అక్కడి నుంచి ఇంటికి చేరడానికి 300 రూపాయల బస్సు ఛార్జీలను కూడా కిడ్నాపర్లు తనకు ఇచ్చినట్లు డాక్టర్ సునీల్ చెప్పారు. కిడ్నాపర్లు కన్నడతో పాటు హిందీలో కూడా మాట్లాడుకోవడాన్ని గమనించినట్లు పోలీసులకు సునీల్ తెలిపారు. వేణుగోపాల్ గుప్తా లిక్కర్ బిజినెస్ గురించి తెలిసిన వాళ్లే ఈ కిడ్నాప్ చేయించి ఉంటారనే అనుమానంతో పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.
A doctor in #Karnataka’s #Ballari district was kidnapped on the morning of January 26, while he was out for a morning walk, was let go by his kidnappers in the evening, for reasons unknown. The doctor was also given Rs 300 for a bus ride home.
— Hate Detector 🔍 (@HateDetectors) January 27, 2025
Dr Sunil, a paediatrician at the… pic.twitter.com/6TwYjguCKF