ఖమ్మం, వెలుగు : తన అత్తను దవాఖానకు తీసుకువెళ్లి ఆటోలో తీసుకువస్తుండగా కిడ్నాప్ చేసిన ఓ ఆటోడ్రైవర్ ఆమెను రేప్ చేశాడు. ప్రతిఘటించడంతో తీవ్రంగా గాయపరిచి దవాఖానలో వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోయింది. సదరు మహిళ ఆచూకీ కోసం కుటుంబసభ్యులు మూడు రోజులుగా ఖమ్మం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందించలేదు. చివరికి ఓ ట్రైనీ ఐపీఎస్ఆఫీసర్ చొరవతో మార్చురీలో డెడ్‌బాడీని గుర్తించడంతో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. బాధితుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చెన్నారావుపేట రామన్నగుట్ట తండాకు చెందిన బాణోత్ నీలా(45) తన అత్త మల్లికి వైద్యం చేయించేందుకు గత నెల 27న ఖమ్మం బయలుదేరింది.
ఖమ్మం రైల్వే స్టేషన్ లో దిగాక అక్కడి నుంచి ఆటోలో మమత దవాఖానకు తీసుకువెళ్లి చూపించింది. తిరిగి అదే రోజు రాత్రి ఇద్దరూ కొత్త బస్టాండ్ కు ఆటోలో బయలుదేరారు. దారిలో మల్లికి మోషన్స్ కావడంతో నీలా డ్రైవర్‌కు చెప్పి ఆటోను పక్కకు ఆపించింది. మల్లి ఆటోకు దూరంగా బహిర్భూమికి వెళ్తుండగా, ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఆటోలో ఉన్న నీలాను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి పాల్పడిన ఆటో డ్రైవర్ 28న ఉదయం తీవ్ర గాయాలతో ఉన్న నీలాను ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో చేర్పించి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ గత నెల 28న కన్నుమూసింది. డెడ్‌బాడీని తీసుకువెళ్లేందుకు ఎవరూ లేకపోవడంతో మార్చురీకి తరలించారు.
మరోవైపు దారిలో ఆగిపోయిన మల్లి రెండు రోజుల తర్వాత తండాకు చేరుకొని కుటుంబసభ్యులు, బంధువులకు జరిగింది చెప్పింది. ఖమ్మం చేరిన కుటుంబసభ్యులు మూడురోజులుగా పలు పోలీస్స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరికి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ట్రైనీ ఆఫీసర్‌గా ఉన్న ఓ ఐపీఎస్ ఆఫీసర్చొరవ తీసుకొని ప్రభుత్వ దవాఖానకు వెళ్లి ఆరా తీయగా, మార్చురీలో నీలా డెడ్‌బాడీ కనిపించింది. దీంతో మృతురాలు నీలా భర్త ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.