చాంద్రాయణగుట్ట, వెలుగు: ఒకరి వద్ద రూ. 30వేలు అప్పుగా ఇప్పించి, జమీనుగా ఉన్న వ్యక్తిని అప్పు ఇచ్చిన వ్యక్తి కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటన ఫలక్నుమా పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ రాజు వివరాల ప్రకారం.. పీఎస్ పరిధిలోని జుబేర్ అనే వ్యక్తికి మొహద్ అమిత్ దగ్గర మొహద్ అలీ రూ. 30వేలు రెండు నెలల క్రితం అప్పు ఇప్పించాడు. ఆ డబ్బుకు అలీ మధ్యవర్తిగా ఉన్నాడు.
ఈ క్రమంలో అప్పు తీసుకున్న జుబేర్ డబ్బు చెల్లించేందుకు అందుబాటులోకి రాలేదు. దీంతో అమిత్.. అలీని కొంతమందితో కలిసి కిడ్నాప్ చేసి గుల్బర్గా తీసుకు వెళ్లి విచక్షణ రహితంగా కొట్టారు. గుల్బర్గాలో పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా ఆలీ అరవడంతో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తులను పట్టుకుని వివరాలు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
దీంతో గుల్బర్గా పోలీసులు స్థానిక ఫలక్నుమా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులు మహమ్మద్ హమీద్, సిరాజ్ , అంజాద్ ఖాన్, సయ్యద్ ఖాజా షేర్ ఫుద్దీన్, మొహాద్ రహీం పాషా, మహమ్మద్ షైక్ ను పట్టుకున్నారు. బాధితుని భార్య అఫ్రీన్ బేగం ఫిర్యాదుతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.