నిజామాబాద్, వెలుగు: ఇందూరు సిటీలో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఆవరణలో కిడ్నాప్‌కు గురైన బాబు కథ సుఖాంతమైంది. ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన అంజుమ్ బేగం తన పదేండ్ల కూతురుతో పాటు దుర్గాప్రభురావుబా మోహితే అనే మహిళతో కలిసి భిక్షాటన చేయించడానికి చిన్నపిల్లలను కిడ్నాప్చేయాలనే ప్లాన్‌తో సిటీకి వచ్చారు.
శుక్రవారం రాత్రి జీజీహెచ్‌లోని పిల్లల వార్డులోకి వెళ్లారు. అనంతరం బయటకు వచ్చి పార్కింగ్‌స్థలంలో తల్లి లక్ష్మి పక్కన నిద్రిస్తున్న ఏడాది బాబు మణికంఠను ఎత్తుకెళ్లారు. నాందేడ్వెళ్లేందుకు రైల్వే స్టేషన్వెళ్లగా రైలు లేదు. కిడ్నాప్ఘటన బయటకు తెలియడంతో పోలీసులకు దొరుకుతామనే భయంతో శనివారం రోజంతా ఆటో రిక్షాలో సిటీలో అటు ఇటూ తిరిగారు. ఆదివారం పాత బస్టాండ్‌నుంచి బస్సులో నాందేడ్వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు బాబును తల్లిదండ్రులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నట్టు సీఐ సీఐ రఘుపతి తెలిపారు.