తీరిన డయాలసిస్ కష్టాలు.. చెన్నూర్​లో అందుబాటులోకి వచ్చిన సెంటర్

  •     రోజుకు ఐదుగురికి డయాలసిస్ సేవలు
  •     దూరాభారం తగ్గిందంటున్న బాధితులు 
  •     ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు

చెన్నూర్, వెలుగు: చెన్నూర్ గవర్నమెంట్ హాస్పిటల్​లో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రావడంతో కిడ్నీ పేషెంట్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. చెన్నూర్, కోటపల్లి,వేమనపల్లి, భీమారం, జైపూర్, నెన్నెల మండలాల్లో సుమారు 50 మంది కిడ్నీ పేషెంట్లు ఉన్నారు. డయాలసిస్ కోసం వీరంతా గతంలో బెల్లంపల్లి, మంచిర్యాల హాస్పిటళ్లకు వెళ్లేవారు.

అప్ అండ్ డౌన్ దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మారుమూల గ్రామాల నుంచి టైంకు బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ వెహికల్స్​ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇలా వారానికి రెండు మూడుసార్లు వెళ్లిరావడానికి అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కొన్నారు. 

ఎమ్మెల్యే వివేక్ చొరవతో.. 

చెన్నూర్ ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి చొరవతో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్​లో డిసెంబర్ 27న డయాలసిస్ సెంటర్​ను ప్రారంభించారు. ఐదు మెషీన్లతో కూడిన సెంటర్​ను ఓపెన్ చేసి స్టాఫ్​ను నియమించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ నెల 3 నుంచి పేషెంట్లకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. సమీప ప్రాంతాల బాధితులకు చెన్నూర్ దగ్గర కావడంతో వారికి ప్రయాణ కష్టాలు తప్పాయి.

వారానికి రెండు మూడుసార్లు డయాలసిస్  చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో గతంలో కరీంనగర్, మంచిర్యాలలోని హాస్పిటళ్లకు వెళ్లేవారు. దీంతో దూరాభారం పెరిగి అధిక ఖర్చులు కావడంతో కొన్నిసార్లు డయాలసిస్ మిస్సయ్యేవారు. దీంతో పలువురికి పరిస్థితి విషమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమ కష్టాలను గుర్తించి త్వరతగతిన డయాలసిస్ సెంటర్​ను ప్రారంభించిన ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామికి  పేషెంట్లు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

పేషెంట్లు పెరుగుతున్నరు

చెన్నూర్​తో పాటు చుట్టుపక్కల మండలాల్లో సుమారు 50 మంది కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులున్నారు. వారు వివిధ హాస్పిటళ్లలో ట్రీట్​మెంట్ తీసుకుంటూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ నెల 3 నుంచి ఇప్పటివరకు 20 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారికి షిఫ్టుల వారీగా వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేస్తుండగా, ప్రతిరోజూ ఐదుగురికి సేవలందిస్తున్నామని టెక్నీషియన్ రాకేశ్ తెలిపారు.

చెన్నూర్​లో డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయిందని తెలుసుకొని వివిధ ప్రాంతాల్లో చికిత్స పొందుతున్నవారు ఇక్కడికి వస్తున్నారని సిబ్బంది చెప్పారు. పేషెంట్లు పెరుగుతుండడంతో టెక్నీషియన్స్, స్టాఫ్ కొరత వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పేషెంట్ల రద్దీకి అనుగుణంగా స్టాఫ్​ను పెంచాలని కోరుతున్నారు. 

జనరేటర్ లేకపోవడంతో ఇబ్బందులు 

డయాలసిస్ సెంటర్​కు ప్రత్యేకంగా జనరేటర్ లేకపోవడం వల్ల కరెంట్ పోయిన సందర్భాల్లో పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేటర్ కెపాసిటీ చాలడం లేదు. దీంతో కరెంట్ పోయినప్పుడు మెషీన్లు ఆగిపోతున్నాయి. 15 నిమిషాల్లోపు కరెంట్ వస్తే యథావిధిగా డయాలసిస్ జరుగుతుంది. కానీ అంతకంటే ఎక్కువ సేపు కరెంట్ పోతే మాత్రం మెషీన్లలో ఉన్న రక్తం వృథా అవుతోంది. రక్తహీనతతో బాధపడే డయాలసిస్ పేషెంట్లు తరచూ రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక కరెంట్ పోయినప్పుడు మెషీన్లలోని రక్తం వృథా కావడం వల్ల పేషెంట్లకు రక్తహీనత సమస్య మరింత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డయాలసిస్ సెంటర్​కు ప్రత్యేకంగా జనరేటర్​ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మొన్నటిదాకా చాలా కష్టమైంది

నా పేరు కుమ్మరి చిన్నక్క(50). కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామం. మా ఊరికి బస్సులు కూడా సక్కగా నడువయ్. నా రెండు కిడ్నీలు పాడైనయ్. 10 నెలల నుంచి కరీంనగర్, మంచిర్యాల సర్కారు దవాఖాన్లకు పోయి డయాలసిస్ చేయించుకున్న. అక్కడికి పోయిరావాల్నంటే చాలా కష్టమయ్యేది. నాతో పాటు ఇద్దరం మనుషులం పోతే మస్తు ఖర్చయ్యేది.  ఇప్పుడు చెన్నూర్​లో పేరు రాయించుకున్న. ఈ దవాఖాన దగ్గర కావడంతో బాధలు తప్పినయ్.  

దూరాభారం, ఖర్చులు తగ్గినయ్​.. 

నా పేరు బాపు(65). మాది నెన్నెల మండలంలోని అవడం గ్రామం. నాకు రెండు కిడ్నీలు ఖరాబ్ అయినయ్. నేను ఇంతకుముందు బెల్లంపల్లి సర్కారు దవాఖానాలో వారానికి రెండుసార్లు డయాసిస్ చేయించుకునేవాణ్ని. అంతదూరం పోవడం చాలా కష్టమయ్యేది. ఖర్చులు కూడా ఎక్కువే అయ్యేవి. చెన్నూర్​లో సెంటర్ ఓపెన్ చేశారని తెలుసుకొని ఇక్కడ పేరు నమోదు చేసుకున్న. ఇప్పటివరకు నాలుగుసార్లు డయాలసిస్ చేయించుకున్న. మాకు ఎంతో మేలు చేసినందుకు ఎమ్మెల్యే వివేక్ సార్​కు కృతజ్ఞతలు.