కిడ్నీ రాకెట్ పై విచారణ

 కిడ్నీ రాకెట్ పై విచారణ
  • డీఎంఈకి నివేదిక అందించిన కమిటీ
  • నివేదిక ఆధారంగా సంబంధిత హాస్పిటల్ పై చర్యలు 

హైదరాబాద్/పద్మరావు నగర్/దిల్ సుఖ్ నగర్, వెలుగు: హైదరాబాద్ సరూర్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ దందా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆ ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు నలుగురు సీనియర్ ప్రొఫెసర్లతో కూడిన విచారణ కమిటీని నియమించగా.. విచారణ చేపట్టిన కమిటీ బుధవారమే నివేదిక సమర్పించింది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పేద వ్యక్తులకు డబ్బు ఆశ చూపి.. వారి నుంచి కిడ్నీలను తీసి డబ్బున్న వారికి ట్రాన్స్ ప్లాంట్ చేస్తూ అలకనంద ఆస్పత్రి నిర్వాహకులు పెద్ద ఎత్తున దండుకుంటున్నట్టుగా విచారణలో కమిటీ గుర్తించినట్టు తెలిసింది.

 ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరిండెంట్ డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఉస్మానియా నెఫ్రాలజీ, యూరాలజీ హెచ్‌‌ఓడీలు ప్రొఫెసర్‌‌ కిరణ్మయి, ప్రొఫెసర్‌‌ మల్లికార్జున్‌‌, ప్రొఫెసర్ సాధనరాయ్ తో కూడిన కమిటీ బుధవారం ఉదయం అలకనంద హాస్పిటల్ కు వెళ్లి విచారణ చేపట్టింది. మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కిడ్నీ  దాతలు, ఇద్దరు కిడ్నీ గ్రహీతలను వివరాలు అడిగి తెలుసుకుంది. 

హాస్పిటల్ లో ఎప్పటి నుంచి ఈ దందా నడుస్తోంది? మొత్తం ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారు? వంటివాటిపై విచారించిన కమిటీ బుధవారం సాయంత్రం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా హాస్పిటల్ పై చర్యలు తీసుకోనున్నారు. కాగా, ఈ కిడ్నీ దందాపై సుమోటోగా విచారించి, డాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) చైర్మన్ డాక్టర్ మహేశ్ తెలిపారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ నాయకులు ధర్మేంద్ర, నెర్లకంటి శ్రీకాంత్ డిమాండ్ చేశారు.   

28న బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ రైతు మహాధర్నాకు హైకోర్టు బుధవారం అనుమతిచ్చింది. ఈ నెల 28న నల్గొండ క్లాక్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌లో  రైతు మహాధర్నా నిర్వహించాలని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నిర్ణయించింది. పోలీసు అధికారులు అనుమతి మంజూరు చేయకపోవడంతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిపై విచారణ చేపట్టిన కోర్టు..28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్నాలో 1500 మంది వరకు మాత్రమే పాల్గొనాలని, నేరచరిత్ర ఉన్నవారు పాల్గొనరాదని, రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయరాదని షరతులు విధించింది. శాంతి భద్రతలకు సమస్య ఎదురైన పక్షంలో పోలీసులు జోక్యం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.